బెంగాల్‌ పంచాయితీ ఎన్నికల్లో హింస

ఘర్షణల్లో ఐదుగురు మృత్యువాత

కోల్‌కతా,మే14(జ‌నంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. ప్రశాంతగా సాగాల్సిన ఎన్నికలు హింసను రాజేశాయి. ఆధిపత్యపోరుతో పార్టీలు చేస్తున్న పోరాటం ప్రజల ప్రాణాల విూదకు వచ్చింది. పోలింగ్‌ హింసలో ఇప్పటికే ఐదుగురు మృత్యువాత పడ్డారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలో సీపీఎం నేత ఇంటికి తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు నిప్పు పెట్టడంతో ఆ నేతతోపాటు ఆయన భార్య మృతి చెందారు. ఇదే జిల్లాలోని కుక్‌తులిలో తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతుదారుపై కాల్పులు

జరపడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఇక ఉత్తర 24 పరగణాల జిల్లాలో మరో సీపీఎం కార్యకర్త పేలుడులో చనిపోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ముర్షిదాబాద్‌లోనూ తృణమూల్‌, బీజేపీ వర్గాల మధ్య జరిగిన బాంబుల దాడిలో ఓ బీజేపీ కార్యకర్త మరణించాడు. కొన్ని చోట్ల బ్యాలెట్‌ పేపర్లను నీళ్లలో పడేశారు. తృణమూల్‌ కార్యకర్తలు బూత్‌ క్యాప్చరింగ్‌లకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల ఓటర్లను పోలింగ్‌ బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు ఉదయం 11 గంటల వరకు 25 శాతం పోలింగ్‌ నమోదైంది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వంలోనే భారీగా హింస చోటు చేసుకుంది.

—-