బెంగాల్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది

` ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగ
` కానీ వారు పండగ స్ఫూర్తినే దెబ్బతీస్తున్నారు
` ఎన్నికల సంఘం పరిశీలకులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు
` మమత ఆరోపణలు
కోల్‌కతా(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌లో బుధవారం రెండోవిడత పోలింగ్ ముగిసింది ఈనేపథ్యంలో తాను బరిలో నిలిచిన భవానీపుర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వెళ్లారు. దీదీపై పోటీ చేస్తోన్న భాజపా నేత సువేందు అధికారి కూడా అక్కడికి వచ్చారు. ఆయన వచ్చేసరికి అక్కడే కూర్చొని ఉన్న మమతను ఉద్దేశించి..‘ఆమెను చూడండి. ఆమెకు ఈ రోజు ఎవరూ ఓటేయరు” అని వ్యాఖ్యానించారు. దీంతో భాజపా, ఎన్నికల సంఘంపై సీఎం విమర్శలు చేశారు. “కేంద్ర బలగాలకు చెందిన సభ్యులు మా పార్టీ కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి, ఓటర్లను భయపెడుతున్నారు. ఈ ఎన్నికల్లో భాజపా రిగ్గింగ్‌కు పాల్పడుతోంది. ఎన్నికల సంఘం పరిశీలకులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు. తణమÖల్ కార్యకర్తను రాత్రి ఎలా కొట్టారో చూడండి. ఇదేం గూండాయిజం..? ఓటింగ్ ఇలా జరగకూడదు. ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగ. కానీ వారు పండగ స్ఫూర్తినే దెబ్బతీస్తున్నారు” అని మమత తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, ఆమె గూండాలను వెంటేసుకొని తిరుగుతూ ఓటర్లను భయపెడుతున్నారని సువేందు కౌంటర్ ఇచ్చారు.ఇదిలాఉండగా.. చాప్రా, శాంతిపుర్, భంగర్ సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఫల్తాబూత్ వద్ద కొందరు గుమిగూడి నినాదాలు చేయడంతో పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ఇక ఉదయం 11 గంటల వరకు 39.97 శాతం పోలింగ్ నమోదైంది.