బైకుల దొంగల ముఠా పట్టివేత తీగ లాగితే డొంక కదిలింది

28 బైకులు చోరిచేసిన దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు

పెద్ద శంకరంపేట పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

 

జనంసాక్షి/పెద్దశంకరంపేట అక్టోబర్ 22 వారంతా పాత నేరస్తులు.. గతంలో పలు వాహనాలు చోరి చేసి పట్టుబడి శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో జైలులో పరిచయమైన ఏడుగురు దొంగలు ముఠాగా ఏర్పడి బుల్లెట్ మరియు పల్సర్ వాహనాలు లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని 28 బైకుల వరకు దొంగలించి చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని శనివారం వివరాలు వెల్లడించారు. నిందితులు జంగం ప్రశాంత్ గౌడ్, షేక్ ఫయాజ్, చాపల సంజీవ్, పున్న హరీష్, బోయిని ప్రశాంత్, పల్లపు హరికృష్ణ, మక్కల లక్ష్మణ్ లు పలు దొంగతనాల్లో శిక్ష పడడంతో నిజామాబాద్ జైలులో పరిచయం ఏర్పరచుకున్నారు. దొంగల ముఠాగా ఏర్పాటై జైలు నుండి విడుదల అయ్యాక పథకం ప్రకారం ఖరీదైన బుల్లెట్, పల్సర్ వాహనాలను దొంగలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో పెద్ద శంకరంపేటలో రెండు బైకులు, టేక్మాల్ పరిధిలో ఒక బైక్, చేగుంట పరిధిలో రెండు, మనోహరాబాద్ పరిధిలో రెండు, సంగారెడ్డి జిల్లా పరిధిలో ఎనిమిది బైకులు దొంగతనాలు చేశారు. భువనగిరి జిల్లా పరిధిలో ఒక బైక్, నల్గొండ జిల్లా పరిధిలో ఒక బైక్ , కామారెడ్డి జిల్లా పరిధిలో ఒక బైక్, మేడ్చల్ జిల్లాలో ఒక బైక్ , హయత్ నగర్ లో ఒక బైక్ దొంగతనం చేశారు. ఇలా మొత్తం 28 బైకులు దొంగతనం చేయగా పెద్ద శంకరంపేట లో వాహనాల తనిఖీలో ఉన్న ఎస్సై బాలరాజుకు చిక్కారు. పోలీసులు తమ దైన శైలిలో విచారణ చేపట్టగా దొంగతనాన్ని ఒప్పుకున్నారు. ఈ దొంగతనాలకు ఒక కారును మరో బైక్ను ఉపయోగించినట్టు ఎస్పీ తెలిపారు. కాగా 20 బైకుల వివరాలు తెలియగా మరో ఎనిమిది బైకుల వివరాలు గుర్తించాల్సి ఉందని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. బైకుల దొంగల ముఠాను గుట్టు రట్టు చేసిన డిఎస్పి సైదులు, సిఐ జార్జ్, పెద్ద శంకరంపేట ఎస్సై బాలరాజ్ మరియు ఏఎస్ఐ అశోక్ సిబ్బంది రామ్సింగ్, వినోద్, రాములు లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.