బోడిగె శోభ పేరు ప్రకటనలో బిజెపి తాత్సారం ఎందుకో?
కరీంనగర్,నవంబర్17(జనంసాక్షి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చొపపదండిపై బిజెపిలో ఇంకా సందిగ్దత తొలగలేదు. బోడిగ శోభ పార్టీలో చేరినా అధికారికంగా ఆమె పేరును పార్టీ ప్రకటించలేదు. చొప్పదండి, మంథని నియోజకవర్గంలో భాజపా అభ్యర్థులెవరనేది తేలాల్సి ఉంది. నాలుగో జాబితాలోనూ ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు లేకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది.. టికెట్ ఆశతోనే పార్టీలో చేరిన బొడిగె శోభ అభ్యర్థిత్వాన్ని ఇంకా పార్టీ ప్రకటించలేదు. ఆమె పార్టీలో చేరిన రోజునే మూడో జాబితాను వెల్లడించినా.. అందులో చొప్పదండి, మంథని అభ్యర్థుల పేర్లు లేకపోవడంతో ఇక్కడి సీటు విషయమై ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే భాజపా తరపున బొడిగె శోభ నామినేషన్ వేసి టికెట్ ఖరారు కోసం ఎదురుచూస్తూనే.. పార్టీ పేరిట ప్రచారాన్ని పెంచుతున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో ఇదివరకే పార్టీలో ఉన్న కొందరు నాయకులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో లింగంపల్లి శంకర్ తనకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో అనూహ్యంగా తెరాస నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కమలం గూటిని చేరడంతో పార్టీలో సవిూకరణాలు మారిపోయాయి. ఆమెతోపాటు నియోజకవర్గంలోని పలువురు నాయకులు పార్టీలో చేరడంతో ఇక్కడ కాస్త ఊపువచ్చింది. మరోవైపు మంథని నియోజకవర్గంలో సంపత్ యాదవ్, సనత్ కుమార్‌లు టికెట్‌ను ఆశిస్తున్నారు. నాటకీయ
పరిణామాల మధ్య సంపత్ యాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లాధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో కమలం గుర్తుపై బరిలో నిలిచేదెవరనేది ఆసక్తికరంగానే మారిపోయింది.