బోనస్ వచ్చె…
ఫైనల్ రేసులో నిలిచె..
విండీస్‌పై టీమిండియా విక్టరీ
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ,జూలై 6 (జనంసాక్షి):
కరేబియన్ గడ్డపై తొలిసారి భారత జట్టు సమిష్టిగా రాణించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ సెంచరీతో మెరిస్తే… బౌలర్లు కలిసికట్టుగా విండీస్ భరతం పట్టారు. దీంతో ఫైనల్ రేసులో నిలిచేందుకు కావాల్సిన విజయంతో పాటుగా బోనస్ పాయింట్ కూడా దక్కింది. టీమిండియా విసిరిన 311 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్‌కు ఆదిలోనే గట్టిఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న క్రిస్‌గేల్‌ను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్‌కు పంపాడు. వెంటనే డారెన్ బ్రావో కూడా సింగిల్ డిజిట్‌కే ఔటవడంతో ఆ జట్టు 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో మరో ఓపెనర్ ఛార్లెస్ జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించాడు. అయితే విండీస్ స్కోర్ 2 వికెట్లకు 56 పరుగులు ఉన్న సమయంలో వరుణుడు అంతరాయం కలిగించాడు. దాదాపు అరగంటకు పైగా ఆట తుడిచిపెట్టుకుపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు. దీని ప్రకారం విండీస్ మరో 29 ఓవర్లలో 218 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తర్వాత భారత బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విండీస్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు. శామ్యూల్స్ , పొల్లార్డ్ , రామ్‌దిన్ తక్కువ వ్యవధిలోనే ఔట్ చేసి మ్యాచ్‌పై పట్టుబిగించారు. ఛార్లెస్ కూడా వెనుదిరిగిన తర్వాత…. బ్రావో , సామి కూడా త్వరగానే పెవిలియన్ చేరుకోవడంతో కరేబియన్ టీమ్ పరాజయం ఖాయమైంది. చివర్లో కీమర్ రోచ్ , సునీల్ నరైన్ మెరుపులు మెరిపించినప్పటకీ ఫలితం లేకపోయింది. వీరిద్దరి పార్టనర్‌షిప్ విండీస్ స్కోర్ 170 దాటేందుకు ఉపయోగపడింది. మొత్తం విూద భారత బౌలర్ల ధాటికి విండీస్ 34 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. భువనేశ్వర్ కుమార్ 3 , ఉమేశ్ యాదవ్ 3 , ఇశాంత్ శర్మ 2 , జడేజా 2 వికెట్లు తీసుకున్నారు.
విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 200 పరుగుల లోపే విండీస్‌ను ఆలౌట్ చేయడంతో టీమిండియాకు బోనస్ పాయింట్ కూడా లభించింది. ఈ విజయంతో తమ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది.