బౌలర్లదే ఆధిపత్యం

– సత్తాచాటని భారత టాప్‌ ఆర్డర్‌

– విండీస్‌ విజయలక్ష్యం 230
విండీస్‌ స్కోర్‌ 11 ఓవర్లలో 58/3

జమైకా, జూన్‌ 30 (జనంసాక్షి) :
ముక్కోణపు సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనే భారత బ్యాట్స్‌మన్‌ తడబడ్డారు. చాంపియన్స్‌ ట్రోఫీ విజయంతో ఊపుమీదున్న భారత్‌ కరేబియన్‌ దీవుల్లో మాత్రం సహజ శైలిలో ఆడలేకపోయింది. భారత టాప్‌ ఆర్డన్‌ బ్యాట్స్‌మన్లు చెప్పుకోదగ్గ స్కోర్లేమీ చేయకుండా నే వికెట్లు సమర్పించుకున్నారు. జమైకాలోని సబీనా పార్క్‌లో ఆదివారం జరిగిన ముక్కోణపు సిరీస్‌ రెండో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ కెప్టెన్‌ డారెన్‌ సమీ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ, శిఖర్‌ దావన్‌ ధాటిగానే ఇన్నింగ్స్‌ ప్రారంభించే ప్రయత్నం చేశారు. 4.2 ఓవర్ల వద్ద కీమా రోచ్‌ బౌలింగ్‌లో దావన్‌ (10 బంతుల్లో 11 పరుగులు, రెండు బౌండరీల సాయంతో) అతడికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. 21 బంతుల్లో సిక్సర్‌ సాయంతో 11 పరుగులు చేసిన కోహ్లీ కెప్టెన్‌ సామి బౌలింగ్‌లో క్రిస్‌గేల్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో వికెట్‌ కోల్పోయాక క్రీజ్‌లోకి వచ్చిన దినేశ్‌కార్తీక్‌, శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 56 బంతులనెదుర్కొని మూడు బౌండరీల సాయంతో 23 పరుగులు చేశాడు. జట్టు స్కోర్‌ 98 పరుగుల వద్ద కార్తీక్‌ శామ్యూల్స్‌ బౌలింగ్‌ అతడికే క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కార్తీక్‌ వికెట్‌ కోల్పోయాక క్రీజ్‌లోకి వచ్చిన రైనా విండీస్‌ బౌలింగ్‌ను ధైర్యంగానే ఎదుర్కొన్నాడు. ఓపెనర్‌గా వచ్చిన శర్మ 31 ఓవర్ల వరకూ క్రీజ్‌లో నిలిచాడు. 89 బంతుల్లో నాలుగు బౌండరీలు, సిక్సర్‌ సాయంతో 60 పరుగులు చేసి కెప్టెన్‌ సామి బౌలింగ్‌లో చార్లెస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్‌ ధోనితో కలిసి రైనా పరుగులు రాబట్టే క్రమంలో రోచ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కోల్పోయాడు. 55 బంతులనెదుర్కొన్న రైనా నాలుగు బౌండరీలతో 44 పరుగులు చేసి వెనుదిరిగాడు. కెప్టెన్‌ ధోని 35 బంతుల్లో 27 పరుగులు చేసి బెస్ట్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. రవీంద్ర జడేజా సైతం ఎక్కువ సేపు నిలదొక్కుకోలేదు. 20 బంతుల్లో రెండు బౌండరీలతో బెస్ట్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ సిక్సర్‌ కొట్టడంతో 229 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్‌ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ ఏడు వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో కెప్టెన్‌ సమీ, కీమా రోచ్‌, బెస్ట్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా శామ్యూల్స్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. 230 పరగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ కడపటి వార్తలు అందేసరికి 11 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. గేల్‌ 11, స్మిత్‌ పరుగులేమి చేయకుండా, శామ్యూల్స్‌ ఒక పరుగు చేసి ఔటయ్యాడు. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ రెండు, భువనేశ్వర్‌కుమార్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు.