బ్రావోపై ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌


పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ ,జూలై 6 (జనంసాక్షి):

శ్రీలంకతో కీలక మ్యాచ్‌కు ముందు వెస్టిండీస్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆ జట్టు సారథి డ్వయాన్‌ బ్రావోపై ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌ విధించారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ బౌలర్లు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయారు. దీంతో మ్యాచ్‌ రిఫరీ జెఫ్‌ క్రో కరేబియన్‌ టీమ్‌ కెప్టెన్‌కు 20 శాతం , మిగిలిన ఆటగాళ్ళకు 10 శాతం జరిమానా విధించారు. అయితే గత 12 నెలల కాలంలో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమనాకు గురవడం విండీస్‌కు ఇది రెండోసారి. దీంతో ఆ జట్టు సారథిని ఒక మ్యాచ్‌ సస్పెండ్‌ చేస్తున్నట్టు ఐసిసి ప్రకటించింది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా విండీస్‌ స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానా ఎదుర్కొంది. ఐసిసి నిబంధనల ప్రకారం ఒక ఏడాదిలో రెండుసార్లు స్లో ఓవర్‌ రేట్‌తో జరిమానాకు గురైతే ఆ జట్టు కెప్టెన్‌పై ఒక మ్యాచ్‌ వేటు పడుతుంది.