బ్రిటన్ సెన్సేషన్ I సెర్బియన్ స్టార్
వింబుల్డన్ టైటిల్ పోరుకు సిధ్ధమైన ముర్రే
జకోవిచ్
లండన్ ,జూలై 6(జనంసాక్షి):
ఊహించినట్టుగానే వింబుల్డన్ టైటిల్ పోరులో ఇద్దరు స్టార్ ప్లేయర్స్ తలపడనున్నారు. పచ్చగడ్డి కోటలో పాగా వేసేందుకు టాప్ సీడ్ నోవాక్ జకోవిచ్ , ఆండీముర్రే ఉవ్విళ్ళూరుతున్నారు. టోర్నీ ప్రారంభంలోనే నాదల్ , ఫెదరర్ , సోంగా లాంటి సీడెడ్ క్రీడాకారులు ఇంటిదారిపట్టినా…. తమ జోరు కొనసాగించిన ముర్రే , జకోవిచ్ టైటిల్ కోసం అవిూతువిూ తేల్చుకోనున్నారు. సెవిూస్ వరకూ ఏకపక్ష విజయాలతో దూసుకొచ్చిన సెర్బియన్ స్టార్ శుక్రవారం మాత్రం టఫ్‌ఫైట్‌ను ఎదుర్కొన్నాడు. అర్జెంటీనా ప్లేయర్ మార్టిన్ డెల్‌పొట్రో గట్టిపోటీ ఇవ్వడంతో ఐదు సెట్ల పాటు పోరాడి గెలిచాడు. తద్వారా కెరీర్‌లో రెండోసారి వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. జకోవిచ్ చివరిసారిగా 2011లో వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్నాడు. గత రికార్డుల పరంగా ముర్రేపై జకోవిచ్‌దే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకూ 18 మ్యాచ్‌లలో తలపడగా.. జకోవిచ్ 11 మ్యాచ్‌లలో విజేతగా నిలిచాడు. నాలుగు గ్రాండ్‌శ్లామ్ మ్యాచ్‌లలో ముర్రేను మూడుసార్లు జకోవిచ్ ఓడించాడు. ఈ మూడుసార్లూ ఆస్టేల్రియా ఓపెన్ ఫైనల్లో కావడం విశేషం. అయితే గ్రాస్‌కోర్టుపై జకోవిచ్‌ను ముర్రే ఒకసారి ఓడించాడు. గత ఏడాది లండన్ ఒలింపిక్స్ సెవిూఫైనల్లో సెర్బియన్‌పై బ్రిటన్ సెన్సేషన్‌దే పై చేయిగా నిలిచింది. మరోవైపు సొంతగడ్డపై ఆండీముర్రేను తక్కువ అంచనా వేసేందుకు వీలులేదు. నాదల్ , ఫెదరర్ లాంటి స్టార్స్ అడ్డులేకున్నా… ముర్రే ఫైనల్‌కు చేరుకునే క్రమంలో మంచి విజయాలు సాధించాడు. ముఖ్యంగా సెవిూస్‌లో పోలండ్ ప్లేయర్‌పై 67 (2/7), 64, 64, 63 తేడాతో జనోవిచ్‌పై గెలుపొందాడు. మూడు గంటలకు పైగా సాగిన పోరులో ముర్రే తొలి సెట్ కోల్పోయి వెనుకబడినా… తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. వరుస సెట్లలో పోలండ్ ప్లేయర్‌ను ఓడించి కెరీర్‌లో రెండోసారి వింబుల్డన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఓవరాల్‌గా ముర్రే కెరీర్‌లో ఇది ఆరో గ్రాండ్‌శ్లామ్ ఫైనల్. గత ఏడాది వింబుల్డన్ టైటిల్ గెలిచేటట్టు కనిపించినా… తుది సమరంలో ఫెదరర్ అడ్డంకిని అధిగమించలేకపోయాడు. ఈ సారి వరల్డ్ నెంబర్ వన్ జకోవిచ్‌ను ఓడించడం అంత ఈజీ కాకపోయినా… ¬ం అడ్వాంటేజ్‌తో పై చేయి సాధించాలని భావిస్తున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జకోవిచ్‌పై ముర్రే గెలిస్తే దాదాపు 77 ఏళ్ళ తర్వాత వింబుల్డన్ సాధించిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఫ్రెడ్ పెర్రీ , బన్నీ ఆస్టిన్ తర్వాత రెండుసార్లు వింబుల్డన్ ఫైనల్‌కు చేరిన తొలి బ్రిటన్ ఆటగాడు ముర్రేనే. ముర్రే ఫైనల్‌కు చేరుకోవడంతో 15 వేల టిక్కెట్ల హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.