భక్తజన సంద్రమైన అమరేశ్వర ఆలయం

కోటప్పకొండలో స్పీకర్‌ కోడెల పూజలు

గుంటూరు,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పంచరామ ప్రథమ క్షేత్రమైన గుంటూరు జిల్లా అమరావతి అమరేశ్వర ఆలయం భక్తజన సంద్రంగా మారింది. వేకువజాము నుంచే భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలాచరించి అమరేశ్వరుని దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి వారిని, బాలచాముండిక మాతను దర్శించుకున్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేలాదిమంది స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లలోనే పులి¬ర, మజ్జిగ, మంచినీళ్లు, పాలు పంపిణీ చేస్తున్నట్లు ఈవో తెలిపారు. కోటప్పకొండ త్రికూటేశ్వరస్వామిని ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. కోటప్ప కొండకు భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. తెల్లవారుజాము 3 గంటలనుంచే రద్దీ ప్రారంభమయ్యింది. చిలకలూరిపేట వైపు నుంచి కొండకు వచ్చే విద్యుత్తు ప్రభల నిర్వాహకులు, పోలీసుల మధ్య వివాదం ఏర్పడటంతో రోడ్డుపైనే ప్రభలు నిలిపివేసి నిర్వాహకులు రాస్తారోకోకు దిగారు. గంటపాటు రాస్తారోకో జరిగింది. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అదనపు ఎస్పీ రామాంజనేయులు, పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు తదితరులు వచ్చి సర్దుబాటు చేయటంతో రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా ఆ రహదారిలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, ఎరపతినేని శ్రీనివాసరావు, వైకాపా ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి తదితరులుత్రికోటేశ్వరుని దర్శించుకున్నారు.