భక్తి శ్రద్ధలతో అష్ట నాగ పూజ
కొండపాక (జనంసాక్షి) ఆగస్టు 26 : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయ దుర్గ సమేత సంతానం మల్లికార్జున స్వామి క్షేత్రంలో శుక్రవారం నాడు రాహుకాలంలో అష్ట నాగ దేవత పూజ నిర్వహించారు.శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలడింది. ఉదయం 6:30 గంటలకు క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ హరినాద్ శర్మ పర్యవేక్షణలో గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీవిజయ దుర్గామాతకు విశేష పంచామృతం ఫలరాసాభిషేకం నిర్వహించారు.
అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతాన మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామి వారికి లఘు వ్యాస పూర్వకంగా రుద్రాభిషేకం జరిగింది. అనంతరం 10:30 గంటల నుండి 12 గంటల వరకు రాహుకాలంలో అష్ట నాగ దేవత పూజ రాహు కేతు దోష నివారణ ,కాలసర్పదోష నివారణ, అపసవ్య కాలసర్ప దోష నివారణ, సర్ప దోష నివారణ పూజలు నిర్వహించారు. తర్వాత అశలాతర్థ వృక్ష ఛాయలో నాగదేవతకు అభిషేకం నిర్వహించారు. క్షేత్రాన్ని సందర్శించిన భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు.