భగ్గుమన్న పార్లమెంట్
భూసేకరణ ఆర్డినెన్సుపై విరుచుకుపడ్డ విపక్షాలు
న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జనంసాక్షి): పార్లమెంటు ఉభయసభల్లో భూ సేకరణ ఆర్డినెన్స్ దుమారం లేపింది. ప్రభుత్వ తీరును విపక్షాలు దుయ్యబట్టాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టిన విపక్షాలు ఇది రైతు వ్యతిరేక అర్డినెన్స్ అని అన్నారు. దీనిని ఆమోదించడం లేద సవరణలు చేయడం అంగీకరించేది లేదన్నారు. అనుకున్నట్లుగానే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆరంభంలోనే అధికార పార్టీకి ప్రతిపక్షాల నుంచి కాక మొదలైంది. రెండో రోజు ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు గందరగోళానికి వేదికయ్యాయి. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాలు అధికార పార్టీపై పలు ప్రశ్నలు సందించారు. ముఖ్యంగా రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న భూసేకరణ బిల్లును తాము ఏమాత్రం ఆమోదించేది లేదని కాంగ్రెస్, జేడీయూ ఇతర విపక్షాలు ముక్త కంఠంగా తేల్చి చెప్పాయి. అయితే ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సమగ్రంగా చర్చించిన తరవాతనే బిల్లును ఆమోదిద్దామని అన్నారు. అందుకు విపక్షనేతలు అంగీకరించకుండా ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని లోక్‌సభలో పట్టుబట్టాయి. దీంతో భూసేకరణ బిల్లుపై లోక్‌సభలో వాడి వేడి చర్చ జరిగింది. భూసేకరణ బిల్లుకు నిరసనగా లోక్‌సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. కాంగ్రెస్, తృణమూల్, ఆప్, ఎస్పీ, ఆర్జేడీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని పేర్కొన్నారు. రైతులకు తొలి నుంచి వెన్నంటి ఉన్నది తామే అని గుర్తు చేశారు. రైతులను ప్రయోజనాలను పూర్తిగా కాపాడుతామని తెలిపారు. ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పాలన ఉండదని తేల్చిచెప్పారు. అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏ నిర్ణయం పైఅయినా ఏకపక్షంగా వెళ్లమని స్పష్టం చేశారు. అంతకు ముందు విపక్షాల ఆందోళనపై స్పీకర్ సుమిత్రా మహాజన్ అసహనం వ్యక్తంచేశారు. ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉన్న సమయంలో సభను అడ్డుకోవడం తగదని హితవు పలికారు. ఇది రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ అని కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జన ఖర్గే అన్నారు. ఇలాంటి ఆర్డినెన్స్ వల్ల రైతులు నష్టపోతారని అన్నారు. అందుకే తాము దీనిని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. రాజ్యసభలోనూ ఇలాంటి దుమారమే చెలరేగింది. ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ… ఆర్డినెన్స్‌ల పేరుతో కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకోవడం సరికాదన్నారు. గతంలో ఐఎంఏ చట్టానికి నాలుగు సార్లు సవరణలు చేశారని అరుణ్‌జైట్లీ గుర్తు చేశారు. కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్‌శర్మ మాట్లాడుతూ.. పారిశ్రామిక వేత్తలకు అబ్ది కలిగించేందుకు ఆర్డినెన్స్‌లు తెస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాల కోసమే తాము ఆర్డినెన్స్‌లు తెచ్చామని వివరించారు. ఆర్డినెన్స్ అనేవి పార్లమెంటుకు బైపాస్‌లాటివి కాదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వీటి విషయంలో తాము ఏ తప్పు చేయడం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీ బైపాస్ ద్వారా ఆర్డినెన్స్ రూపంలో గట్టెక్కాలని చూస్తోందని విపక్షాలు తీవ్రంగా విమర్శించడంతో జైట్లీ జోక్యం చేసుకున్నారు. ‘గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా పలు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆమోదింపజేసుకున్నాయి. చట్టాలు చేశాయి. తమది బైపాస్ రూట్ అని ఆరోపణలు చేయడం తప్పు’ అని రాజ్యసభలో బదులిచ్చారు. ఆర్డినెన్స్పై ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీకీ లేదని చెప్పారు. ఈ దశలో రాజ్యసభలో భూసేకరణ బిల్లుపై చర్చకు కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. భూసేకరణ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దేశంలో ఇప్పటి వరకు 636 ఆర్డినెన్స్‌లు వచ్చాయి. 636 ఆర్డినెన్స్‌ల్లో 80 శాతం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవేనని తేల్చిచెప్పారు. దేశ మొదటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ కూడా పార్లమెంట్ నడువని సమయంలో ఆర్డినెన్స్ తెచ్చారని గుర్తు చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ… భూసేకరణపై లోతైన చర్చ జరపాలని డిమాండ్ చేశారు. మనదేశం వ్యవసాయ ఆధారిత దేశం, భూసేకరణను అన్ని కోణాల నుంచి చూడాలి. పారిశ్రామికవేత్తలకు లబ్ధి కలిగించేందుకే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని ఆమె ఆరోపించింది. ప్రస్తుత ఆర్డినెన్స్ వల్ల రైతులకు నష్టం కలుగుతుంది. భూసేకరణ ఆర్డినెన్స్‌పై రైతులు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. జేడీయూ నేత శరద్‌యాదవ్ మాట్లాడుతూ… భూసేకరణ ఆర్డినెన్స్ వల్ల రైతులకు ఎంతో నష్టం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కువమంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు. మెజారిటీ ఉందని ఇంతకు ముందున్న చట్టాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ఆర్డినెన్స్ వల్ల రైతులకు నష్టం కలుగుతుందన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్‌పై రైతులు ఆగ్రహంగా ఉన్నారని సభదృష్టికి తెచ్చారు. గతంలో రైతుల సమస్యపై సభలో లోతుగా చర్చించామని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్‌శర్మ మాట్లాడుతూ… భూసేకరణ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం సభ ప్రారంభమవగానే స్పీకర్ హవిూద్ అన్సారీ ప్రశ్నోత్తరాలను ప్రవేశపెట్టారు. అదే సమయంలో భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చను చేపట్టాలని ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును ఆయన తిరస్కరించారు. దీంతో తక్షణమే బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బీఎస్సీ, తృణమూల్, వామపక్షాలు కాంగ్రెస్కు జతకలిశాయి. ఆందోళన విరమించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. అధికారం ఇచ్చాం కదా అని ఇష్టమొచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదని జేడీయూ అధినేత శరద్ యాదవ్ అన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందిస్తూ ఇవి రైతులకోసం కాకుండా పారిశ్రామిక వేత్తల కోసం తెస్తున్న ఆర్డినెన్స్ అని తీవ్రంగా ఆరోపించారు. మొత్తంగా ఉభయసభల్లో దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది.