భవిష్యత్‌కు పునాదుల వేద్దాం.. కేసీఆర్‌ను సీఎం చేద్దాం
` ఎన్నిక ఏదైనా కారు గుర్తు గెలవాలి… : కేటీఆర్
భువనగిరి(జనంసాక్షి): ‘సర్పంచి ఫలితాలు స్ఫూర్తి కావాలి. ఎన్నిక ఏదైనా కారు గుర్తు గెలవాలి. పార్టీ శ్రేణులు మనస్పర్థలు వీడి.. సంఘటితంగా పని చేయాలి. కేసీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలి. అందుకు అందరం కంకణ బద్దులు కావాలి’’ అని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యానివాహక అధ్యక్షుడు కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన భారత రాష్ట్ర సమితి సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి జనవరిలో కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. సర్పంచి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక దురాగతాలకు పాల్పడిరదని, అయినా చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలవలేకపోయారని విమర్శించారు. యాదాద్రి జిల్లాలో వచ్చిన ఫలితాల స్ఫూర్తితో రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరు నిలిచినా.. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రేవంత్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. భారత రాష్ట్ర సమితి సర్పంచ్‌లను వేధింపులకు గురిచేసినా.. అక్రమంగా తొలగించినా.. వారి తరఫున న్యాయపోరాటం చేయడానికి జిల్లా కేంద్రాలలో లీగల్ సెల్ ఏర్పాటు చేసి న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కర్నే ప్రభాకర్ బూడిద బిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



