భవిష్యత్తులో వెలుగుల తెలంగాణ కేసీఆర్‌


sxt0aycrఖమ్మం: ఖమ్మం నగర శివారులోని చెరుకూరి మామిడితోటలో తెరాస 15వ ప్లీనరీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాజకీయ జీవితంలో నిరంతరం పనిచేయాలి.. విరామం సరికాదని నేతలకు సూచించారు. ప్రజల ఆదరణ పొందేలా పనితీరు ఉండాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు చేపడుతున్నామని వివరించారు. ప్రజలు.. ప్రభుత్వానికి మధ్య కార్యకర్తలు వారధిగా ఉండాలని కోరారు. సంక్షేమ రంగానికి సుమారు రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. చేనేత, మత్స్య, యాదవ, గీత కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు.. కష్టాల్లో ఉన్న వారికి ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత మనదేనని నేతలకు సూచించారు. మే నెల ముగిసే సమయానికి కార్యకర్తలకు పదవులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పేదరికాన్ని తరిమికొట్టేలా భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని, భవిష్యత్‌లో పూర్తి వెలుగుల తెలంగాణ చూస్తారని ప్రకటించారు.
కేసీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.30వేల కోట్ల పెట్టుబడులు సాధించగలిగాం
* ఐటీ రంగంలో అనతి కాలంలోనే నెంబర్‌ 1 స్థాయికి చేరబోతున్నాం
* పార్టీ కన్నతల్లి లాంటిది.. కష్టపడి విధేయత, ఓపికతో పనిచేయాలి.ఎవరికైనా అవకాశం రాకపోతే చిన్నబుచ్చుకోవద్దు.
* మే ఆఖరు నాటికి కార్యకర్తలకు దాదాపు 4వేల పదవులు రాబోతున్నాయి.
* రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాను సమస్యశ్యామలం చేస్తాం
* ప్రతి ఇంటికీ తాగునీరు ఇవ్వకుంటే మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడగం
* 100శాతం ఎన్నికల హామీలను నెరవేర్చిన ఏకైక పార్టీ తెరాస. ఎన్నికల్లో ఇవ్వని పథకాలనూ అమలు చేస్తున్నాం.
* శాశ్వత ప్రయోజనం చేకూర్చే పథకం మిషన్‌ కాకతీయ
* తాగునీటి సమస్య శాశ్వత నివారణ కోసమే మిషన్‌ భగీరథ అని వివరించారు.