భానుడి భగభగలకు సేదదీరడమే మందు
ప్రాదేశిక ఎన్నికల ముగింపుతో
ఊపిరి పీల్చుకుంటున్న పార్టీల నేతలు
నిజామాబాద్,మే15(జనంసాక్షి): రోజురోజుకు భానుడు ఉగ్రరూపం దాల్చుతున్న క్రమంలో ప్రాదేశిక
ఎన్నికలు కూడా పూర్తవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల కార్యకర్తలు హాయిగా సేదదీరే పనిలో ఉన్నారు. మొన్నటి వరకు తగ్గినట్లే తగ్గిన ఎండలు.. ప్రస్తుతం భగభగ మండు తున్నాయి. రెండు మూడు రోజులుగా జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం బయటకు రావాలంటే జంకే పరిస్థితి ఏర్పడింది. భానుడి తాకిడికి ప్రధాన కూడళ్లతో పాటు గ్రామాలకు వెళ్లే రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఎండ దెబ్బకు చిన్నారులు, పెద్దలు, వృద్ధులు తట్టుకోలేక పోతున్నారు. ఉదయం 10.30 గంటలకే ప్రజలు తమ పనులన్నీ ముగించుకొని ఇండ్లలో సేదతీరు తున్నారు. ఇప్పటికే జిల్లాలో 44.0 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు వడగాలులు తోడయ్యాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో ఉన్న నేతలు నానా హైరానా పడ్డారు. కొందరు ముఖం చాటేశారు. ఇకపోతే పుట్‌పాత్, చిరు వ్యాపారులు ఎండతీవ్రతకు విలవిలలాడుతున్నారు. ఇప్పుడే ఇలా ఎండలు మండుతుంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మిట్ట మధ్యాహ్నం వాహనాలు లేక రహదారులు బోసిపోతున్నాయి. ఎండల నుంచి రక్షణ కోసం మహిళలు స్కార్ఫ్‌లు ధరిస్తున్నారు. వ్యవసాయ పనులు, ఉపాధి కూలీలు ఉదయం 12 గంటల్లోపే పనులు చక్కబెట్టేసుకొని ఇండ్లకు చేరుకుంటున్నారు. ఎండ వేడిమికి తోడు వడగాల్పులు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి పిల్లలు, పెద్దలు ఇంటికే పరిమితమవుతున్నారు. సాయంత్రం 6 గంటల అయినా ఎండ తగ్గడం లేదు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావడం లేదు. పనులు చేసుకొనేందుకు సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు వస్తున్నారు. చిరువ్యాపారులకు ఎండలు వరంగా మారాయి.