భారత్‌లో పర్యటించే ఆస్టేల్రియా జట్టు ప్రకటన
సిడ్నీ, పిబ్రవరి7(జనంసాక్షి) : ఈ నెల చివరలో భారత గడ్డపై ఆస్టేల్రియా జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆస్టేల్రియా జట్టు టీమిండియాతో రెండు టీ20లు, ఐదు వన్డేలను ఆడనుంది. తాజాగా ఈ రెండు సిరీస్‌ల కోసం 16మందితో కూడిన జట్టుని ఆస్టేల్రియా ప్రకటించింది. ఆసీస్ జట్టుకు ఆరోన్ ఫించ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ టూర్‌కు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ దూరం అయ్యాడు. స్టార్క్ శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో గాయపడడంతో అతన్ని వన్డే, టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అతని స్థానంలో కేన్ రిచర్డ్‌సన్‌ని ఎంపిక చేశారు. షాన్ మార్ష్ తన భార్య ప్రసవానంతరం జట్టుతో చేరుతాడని క్రికెట్ ఆస్టేల్రియా తెలిపింది. అప్పటి వరకూ అతని స్థానంలో డీఆర్క్ షార్ట్ జట్టులో ఉంటాడు. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, హేజల్‌వుడ్, పీటర్ సిడిల్‌లను ఎంపిక చేయలేదు. ఈనెల 24న విశాఖపట్నం వేదికగా తొలి టీ20 ప్రారంభం కానుంది. 27న బెంగుళూరులో రెండవ టీ20 జరుగుతుంది. అనంతరం మార్చి 2వ తేదీన హైదరాబాద్‌లో మొదటి వన్డే జరగనుంది. అనంతరం నాగపూర్, రాంచీ, మొహాలీ, ఢిల్లీలలో వరుసగా వన్డేలు జరగనున్నాయి.
ఆస్టేల్రియా టీ20, వన్డే జట్టు..
అరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), జేసన్ బెరెండ్రాఫ్, కౌల్టర్ నైల్, పీటర్ హ్యాండ్స్‌కబ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లయన్, షాన్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, జీ రిచర్డ్‌సన్, కేన్ రిచర్డ్‌సన్, మార్కస్ స్టాయినిస్, ఆస్టన్ టర్నర్, ఆడమ్ జంపా, డీఆర్క్‌షార్ట్.