భారత్‌లో ఫేస్‌బుక్‌దే జోరు!

సామాజిక వెబ్‌సైట్లలో ఫేస్‌బుక్ అగ్రస్థానంలో దూసుకుపోతున్నది. ఇతర సామాజిక వెబ్‌సైట్ల కంటే భారత్‌లో అత్యధిక మంది ఫేస్‌బుక్‌నే వినియోగిస్తున్నారని అంతర్జాతీయ పరిశోధన సంస్థ టీఎన్‌ఎస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా వినియోగిస్తున్న వారిలో 51 శాతం మంది రోజువారి లాగిన్ అవుతున్నారట. ఫేస్‌బుక్‌కు అంతర్జాతీయంగా 149 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, అదే భారత్‌లో 12.5 కోట్ల మంది ఉన్నారు. మొత్తం 50 దేశాల్లో 60,500 మందిపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారిలో 30 శాతం మంది ఫేస్‌బుక్‌ను వాడుతుండగా, వాట్సప్‌ను 25 శాతం మేర వినియోగిస్తున్నారని వెల్లడించింది. థాయ్‌లాండ్‌లో 78 శాతం మంది ఫేస్‌బుక్‌ను రోజువారి వినియోగిస్తుండగా, తైవాన్‌లో 75 శాతం, హాంకాంగ్‌లో 72 శాతం మంది వినియోగిస్తున్నారు. అలాగే వాట్సప్‌ను వినియోగించేవారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నది.