భారత్- అమెరికా లాజిస్టిక్స్ ఒప్పందం
– సంతకాలు చేసిన రక్షణ మంత్రులు
వాషింగ్టన్,ఆగస్టు 30(జనంసాక్షి): రక్షణ వ్యవస్థలో కీలక నిర్ణయం జరిగింది. అమెరికాతో రక్షణ అవసరాలపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, భారత్‌ల మధ్య మిలిటరీ లాజిస్టిక్స్ ఒప్పందం కుదిరింది. అమెరికా పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్, అమెరికా రక్షణ మంత్రి ఆష్ కార్టర్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు సైనిక అవసరాల కోసం రెండు దేశాల ల్యాండ్, ఎయిర్, నావల్ స్థావరాలు పరస్పరం ఉపయోగించుకోవచ్చు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరస్పర అవకాశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. అంటే ఇక విూదట యుద్ధవిమానాలు, యుద్ధనౌకల మరమ్మతులు, ఇంధన భర్తీ తదితరాల కోసం భారత సైనిక స్థావరాలను అమెరికా, అమెరికా సైనిక స్థావరాలను భారత్ వాడుకోవచ్చు. సన్నిహిత భాగస్వామ్య దేశాలతో ఏ మేరకు ఒప్పందాలు కుదుర్చుకోగలరో ఆ మేరకు భారత్‌తో రక్షణ వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం పంచుకునే అంశాలపై అమెరికా అంగీకరించిందని ఇరు దేశాల ప్రతినిధుల సమావేశం అనంతరం సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. విూడియా సమావేశంలో అమెరికా మంత్రి కార్టర్, భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడారు. ఇరు దేశాలు నావికాదళం, సంయుక్త ఆపరేషన్స్‌కు, మానవతాదృక్పథంతో సహాయపడే అంశంలో పరస్పరం సహకరించుకుంటాయని పేర్కొన్నారు. అమెరికా-భారత్‌ల రక్షణ సంబంధాలకు సంబంధించి ఈ ఒప్పందం గొప్ప మైలురాయి అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌లోకి అమెరికా దళాలు వెళ్లవని.. జాయింట్ ఆపరేషన్స్ లాజిస్టిక్స్ సులువుగా, ప్రభావవంతంగా చేయడానికి ఉపయోగపడుతుందని కార్టర్ తెలిపారు.