భారత మాత్ర విగ్రహాన్ని తొలగించడం దారుణం
తాలిబన్లను మించిన జగన్ పాలన
గిరిజనులను దారుణంగా హింసించడం ఎక్కడి పాలన
జగన్ తీరుపై మండిపడ్డ టిడిపి నేత లోకేశ్
అమరావతి,అగస్టు24(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ వైకాపాబన్లు… అరాచకాలలో ఆప్ఘనిస్థాన్ తాలిబన్లను మించిపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ తన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని, నిరుపేదల ఇళ్లు కూల్చేశారు. ఇప్పుడు భద్రత పేరుతో భరతమాత గుండెలపై గునపం దింపారని మండిపడ్డారు. తనకి 2 కోట్లతో గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి… తన ఇంటి దగ్గర భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఆయన నిరంకుశ, ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనమని అన్నారు. ప్రొక్లయినర్లతో పెకలించిన భరత మాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని… చేసిన మూర్ఖపుపనికి క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఇదిలావుంటే ఆదివాసులకు రక్షణగా ఉన్న చట్టాలను జగన్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చిన రంపచోడవరం ఐటీడీఏ తీరుపై ఉద్యమిస్తున్న గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపడం దారుణమన్నారు. చర్చల పేరుతో ఆహ్వానించి, పోలీసులతో నిర్బంధించి, నేరం చేసిన వాళ్లలా నేలపై గిరిజన ప్రతినిధుల్ని కూర్చోబెట్టి తీవ్రంగా అవమానించడం జగన్ రెడ్డి అధికార దర్పానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. గిరిజన అభ్యున్నతికి పాటుపడాల్సిన అధికారే… గిరిపుత్రుల పాలిట అరాచకంగా ప్రవర్తించడం క్షమించరాని నేరమన్నారు. గిరిజనుల హక్కులు కాపాడాలని, వారికి రక్షణగా ఉన్న చట్టాలు, జిఓలు పక్కాగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేటరైట్ పేరుతో సాగిస్తున్న బాక్సైట్ అక్రమమైనింగ్ దందాని జగన్ అండ్ కో తక్షణమే నిలిపివేయాలని లోకేష్ అన్నారు.