భారత రాజకీయాల్లో ఓ ఆశాకిరణం

2

సంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయం

సామాన్యుడి ప్రతిరూపం ఆమ్‌ఆద్మీ

జడ్‌ ప్లస్‌ భద్రత వద్దన్న కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జనంసాక్షి): దిల్లీలో ఆమ్‌ఆద్మీ సాధించిన విజయం సామాన్యుని సగర్వంగా నిలబెట్టింది. సంప్రదాయ రాజకీయాలకు చరమగీతం పాడాలన్న జనత సంకల్పం నెరవేరటంతో దేశానికి ఆప్‌ ఆశాకిరణంలా కనిపిస్తున్నది. సామాన్యుని ప్రతిబింబంగా ఆప్‌ ఉండాలని ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అహంకారం వీడి అభివృద్ధివైపు పయనించాలని పిలుపునిచ్చారు. తనకు జడ్‌ ప్లస్‌ భద్రత వద్దని కేజ్రీవాల్‌ కుండబద్ధలుకొట్టారు. ఇక స్వచ్ఛభారత్‌ కేవలం నినాదంగానే మిగిలిపోయింది. ప్రధానికి చిత్తశుద్ది ఉన్నా అమలులో చిత్తశుద్ది లోపించింది. దేశవ్యాప్తంగా ఇప్పుడది నినాదాలకు బాగా పనికి వస్తోంది. ప్రజల్లో మార్పుకు నినాదాలు కాదు విధానాలు కావాలని గుర్తించాలి.  కానీ స్వచ్ఛ రాజకీయ నినాదం మాత్రంసక్సెస్‌ అయ్యింది. ఏ ఒక్కరోజులోనో ఇది సంభవం కాలేదు. ప్రజలను కూడగట్టి వారి అండతో చేసిన పోరాటం కారణంగానే ఢిల్లీలో ప్రజలు కేజ్రీవాల్‌ను ఆదరించారు. దీనిని  ఆచరణలో చూపాలన్న తాపత్రయం ఆప్‌ నేత ప్రదర్శించడం వల్లను సామాన్యులు  చేరువయ్యారు. నిర్భయకేసు నుంచి లంచగొండులను తరమండి అన్న వరకు అన్నీ కూడా చేతల్లో చూపిన కేజ్రీవాల్‌ స్వచ్చ రాజకీయాలకు కేంద్ర బిందువు అయ్యారు. ఆయన విజయ రహస్యం ఇదేనని ప్రజలే స్వయంగా ఒప్పుకుంటున్నారు. రాజకయీ విశ్లేషకులు సైతం దీనిని అంగీకరిస్తున్నారు. దేశానికి కావాల్సిది ఇప్పుడు స్వచ్ఛ రాజకీయాలు. అవినీతిలో కూరుకుపోయి, భ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించి ఢిల్లీ ఎన్నికల్లో తమ ఆకాంక్షను చాటారు. అందుకే  ఆప్‌ మంచి విజయం సాధించి, ప్రజల్లో వారు సృష్టించిన అంచనాలను అందుకొనాలని ఆశిస్తున్నారు.  గొప్ప విజయం సాధించారని దేశం యావత్తూ ఇప్పుడు కేజ్రీవాల్‌ను  ప్రశంసించడం చూస్తుంటే సామాన్యుడకి ప్రజల అండ వుంటుందని నిరూపించారు. సంప్రదాయ రాజకీయ విధానాలకు విభిన్నంగా వెళ్తూ కేజీవ్రాల్‌ హస్తినవాసుల మనసు దోచుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో వారణాశి నుంచి నరేంద్రమోదీపై పోటీ చేసినా కేజీవ్రాల్‌ విజయం సాధించలేకపోయారు. కానీ విజయకాంక్షను వీడలేదు. ఆనాటి ఎన్నికలు వేరు. ఆనాడు ప్రజలు మోడీని కోరుకున్నారు. పరాజయం నుంచి తేరుకుని ఆయన కుదురుకున్నారు. బలమైన అనుచర గణంతో నేరుగా ప్రజల వద్దకు వెళ్లిపోయి, భాగస్వామ్య రాజకీయాలకు కేజీవ్రాల్‌ పెద్దపీట వేశారు. మిగిలిన పార్టీలను కకావికలం చేస్తూ ఈసారి ఎన్నికల్లో అజేయునిగా నిలిచారు. ఇదంతా ప్రజల ఆకాంక్షలను గుర్తించి ముందుకు సాగడం వల్లనే సాధ్యం అయ్యింది. మార్పును చూపిస్తానంటూ అపూర్వమైన విజయాన్ని మూటగట్టుకున్న కేజీవ్రాల్‌.. 2011లో ఉద్యమకర్త అన్నాహజారేతో కలిసి జన లోక్‌పాల్‌ బిల్లు కోసం పోరాడినప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. అప్పట్లో హజారేతో పాటు తొలి మహిళా ఐ.పి.ఎస్‌. అధికారి  కిరణ్‌బేడీ, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌లతో ఆయన ఉద్యమించారు. జనలోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా రూపకల్పనలో పౌర సమాజం ప్రతినిధిగా వ్యవహరించారు. వారు ఇచ్చిన ముసాయిదాను ప్రభుత్వం తిరస్కరించింది. దమ్ముంటే రాజకీయాల్లోకి వచ్చి, విజయం సాధించి, అవినీతి నిర్మూలనకు పార్లమెంటులో అడుగుపెట్టాలని కాంగ్రెస్‌, ఇతర పార్టీలు విసిరిన సవాల్‌ను ఆయన స్వీకరించారు. దాని ఫలితంగానే ఆప్‌ పురుడు పోసుకుంది. రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్షలను గుర్తించకపోతే విప్లవం వస్తుంది. ప్రపంచచరిత్రే ఇందుకు నిదర్శనం. చైనా, రష్యా, ఫ్రాన్స్‌, క్యూబా ఇలా ఏ దేశ చరిత్ర తీసుకున్న విప్లవాల వీచికలు వివరిస్తాయి. ఇవన్నీ మనకు గుణపాఠం కావాలి. అందుకే ఆప్‌ పుట్టుక కూడా ఓ విప్లవంగానే గుర్తించాలి. చిత్తశుద్ది ఉంటే రాజకీయాలను ప్రక్షాళన చేయవచ్చని, ధనస్వమ్యం నుంచి దీనిని బయటపడేయవచ్చని కేజ్రీవాల్‌ రుజువు చేశారు. తాను చదువుకున్న ఇంజనీరింగ్‌ నైపుణ్యాలు ఇందుకు దోహదపడ్డాయని భావించాలి. ఖరగ్‌పూర్‌ ఐ.ఐ.టి. నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన కేజీవ్రాల్‌ మృదువుగా మాట్లాడతారు. అయితే దృఢ చిత్తంతో వ్యవహరిస్తారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేశాక మూడేళ్ల పాటు టాటా స్టీల్‌లో పనిచేశారు. అందుకేనేమో ఉక్కు సంకల్పాన్ని అలవర్‌ఉకున్నారు. 1992లో యూపీఎస్సీ పరీక్ష రాయడం కోసం ఆ ఉద్యోగం వదిలేశారు. తొలి ప్రయత్నంలోనే ఆ పరీక్షల్లో విజయం సాధించి భారత రెవెన్యూ సర్వీస్‌ (ఐ.ఆర్‌.ఎస్‌.) అధికారి అయ్యారు. ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తూ సామాజిక అంశాలపైనా, సహ చట్టం విస్తృతి కోసం పాటుపడ్డారు. అక్కడే ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమానికి బీజం వేశారు. అందుక గానూ ఆయన ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసె పురస్కారానికి ఎంపికయ్యారు. మెగసెసె పురస్కారానికి వచ్చిన రూ.30 లక్షలే మూలనిధిగా ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. ఐ.ఆర్‌.ఎస్‌.లో తన సహాధ్యాయి సునీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సాదాసీదాగా జీవించడానికే ఇష్టపడే కేజీవ్రాల్‌ ఆహార్యాన్ని చూస్తే ఓ సగటు ప్రభుత్వోద్యోగి స్ఫురణకు వస్తారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం రెండేళ్లు సెలవు తీసుకుని తిరిగి 2002లో ఆయన ఆదాయపు పన్ను శాఖలో చేరినా ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. 18 నెలల పాటు ఖాళీగా జీతం తీసుకోవాల్సి వచ్చినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో 2006లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంటే ఓ రకంగా విధుల కేటాయింపుల్లోనూ ప్రభుత్వం ఎంతగా నిరల్‌క్ష్యానికి గురిచేసిందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివాదంలో రూ.9.27 లక్షలను ప్రభుత్వానికి చెల్లించడానికి ఆయనకు స్నేహితులే అప్పుగా ఇచ్చారు. ఉక్కులాంటి సంకల్పమే కేజ్రీవాల్‌ను రాజకీయాలకు ప్రేరేపితం చేశాయనవచ్చు. కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్లు దిల్లీలో 15 ఏళ్లుగా అధికారంలో ఉండీ ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్‌ను గత అసెంబ్లీ ఎన్నికల్లో మట్టి కరిపించారు. అయితే అధికారం వచ్చినా రాజీపడే మనస్తత్వం కాదు కనుక కేజ్రీవాల్‌  ముచ్చట 49 రోజుల్లోనే ముగిసిపోయింది.  అధికారంలో ఉన్నది కొద్ది రోజులే అయినా తనదైన అంటే సామాన్యుడి ముద్ర చూపించాలని ఆరాటపడ్డారు. పద్ధతీపాడూ లేని విద్యుత్తు బిల్లులను చించివేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్తు సరఫరా కంపెనీల ఒప్పందాలు, తాగునీటి సరఫరా తీరుపైనా కొరడా ఝళిపించారు. అంతకు ముందు ఓ సందర్భంలో దిల్లీ సీఎంగా ఉన్న షీలా దీక్షిత్‌ ఇంటి ముందు ఆయన ఆందోళన చేపట్టినప్పుడు పోలీసులు ఈడ్చిపడేసినా వెనక్కి తగ్గలేదు. బంతిని ఎంతగట్టిగా కొడితే అంత స్పీడుగా వస్తుందన్న సూత్రాన్ని నిజం చేశారు. సీఎంగా అర్థంతరంగా గ్దదె దిగిపోయినందుకు ఎన్ని విమర్శలు వచ్చినా కుంగిపోలేదు. ప్రజలకు క్షమాపణలు చెప్పి,  ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చిందో వివరించారు. ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేయాలంటూ పార్లమెంటు భవనం సవిూపంలో కేజీవ్రాల్‌ ఒక ముఖ్యమంత్రిగా ధర్నా చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. కానీ ఆయన ఆనాడు తీసుకున్న  నిర్ణయం సరైనదేనని నిరూపించాడు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని రకాలుగా అవమానించినా నా పడిలేచిన కెరటంలా కేజ్రీవాల్‌ ప్రజల ముందు నిలిచి గెలిచారు. సామాన్యుడి విశ్వరూపాన్ని చూపారు.