భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచిన రాష్ట్ర ప్రభుత్వం.
– ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీలో ఎస్సీ,ఎస్టీ లకు అన్యాయం.
– రిజర్వేషన్ కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధం.
– పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ను తొలగించాలని డిమాండ్…
బూర్గంపహాడ్ సెప్టెంబర్11 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక సామాజిక న్యాయ వేదిక జిల్లా అధ్యక్షులు కోడె బోయిన రవి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్ ను తొలగించి, ఆ స్థానంలో రాజ్యాంగ విలువలు కాపాడగలిగిన వ్యక్తిని బోర్డు చైర్మన్గా నియమించాలని డిమాండ్ చేశారు.
భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచిన రాష్ట్ర ప్రభుత్వం 2016, 2018 లో వచ్చిన ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్ లలో ఓసి-80, బిసి- 70, ఎస్సీ, ఎస్టీ- 60 ల ఉత్తీర్ణత మార్కులుగా, ఎలాంటి ‘ నెగెటివ్ మార్కులు లేకుండా నిర్ణయించారు. ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ లో నెగిటివ్ మార్క్స్ పెట్టి ఓసి, బిసి, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులందరికీ ఒకేరకమైన మార్కులను ఇస్తూ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఓసీలకు 20 మార్కులు తగ్గించి, బీసీలకు10 మార్కులు తగ్గించి, ఎస్సీ ఎస్టీలకు ఒక్క మార్క్ కూడా తగ్గించకుండా రిజర్వేషన్ స్ఫూర్తికి విరుద్ధం గా తీవ్ర అన్యాయం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగానికై సుమారు 6లక్షల మంది పరీక్షలు వ్రాయగా నెగెటివ్ మార్కుల నిబంధనకు 4 లక్షల మంది మెయిన్స్ కు రాలేకపోయారని వారన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కూడా 60 మార్కులకు కటాఫ్ పెట్టి 40 కి తగ్గించాలని రవి డిమాండ్ చేశారు. నెగెటివ్ మార్కుల విధానాన్ని వెంటనే రద్దు చేసి, పాత పద్దతిలో కటాఫ్ కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.