భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహించాలి

అగస్టు 9 నుండి 22 వరకు నిర్వహించే భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లు పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
 ప్రతి ఇంటిపై జాతీయ జెండ ఎగరవేయాలి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
స్వాతంత్య్రన్ని సాధించుకుని 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్బంగా భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లను  చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా అధికారులతో,ఎం.పి.డి. ఓ.లు,తహశీల్దార్ లు,ఎం.పి. ఓ.లు,ఎం. ఈ. ఓ.లతో భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వతంత్ర  వజ్రోత్సవ  వేడుకలను ఘనంగా నిర్వహించుటకు ప్రభుత్వం ఉత్తర్వులను జారిచేసిందని,  జిల్లా స్థాయి నుండి మొదలుకొని గ్రామస్థాయి వరకు ఆగస్టు  8వ తేది నుండి 22వ తేది వరకు వేడుకలు పండుగ వాతావరణం తలపించేలా నిర్వహించాలని అన్నారు.  వేడుకల నిర్వహణలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యులను చేయాలని,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా  ఏర్పాట్లు చేయాలని అన్నారు.    కార్యక్రమంలో బాగంగా ప్రతి ఇంటింటికి  జాతీయ జేండాను అందించడం జరుగుతుందని,9 వ తేదీన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు జరిపి అనంతరం ప్రజా ప్రతినిధులు, వార్డ్ కమిటీ లు సహకారం తో మున్సిపాలిటీ లలో జాతీయ జెండాలు పంపిణీ చేయాలని, 10వ తేదిన పంచాయితిలో గ్రామ సభ నిర్వహించి ప్రజా ప్రతినిధులు,పుర ప్రముఖులు భాగస్వామ్యులను చేసి గ్రామ సభ అనంతరం జెండా పంపిణి చేయాలని ఎం.పి.డి.లు,ఎం.పి. ఓ.లు  కోఆర్డినేట్ చేయాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను లైటింగ్ తో అలంకరించాలనీ,ముఖ్యంగా హైవే  లు ప్లై ఓవర్ లపై జిల్లా బోర్డర్ లలో ఫ్లెక్సీ లు,లైటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు.
వేడుకల్లో భాగంగా 10 వ తేదీన వనమహోత్సవం జరపాలని, కనీసం 75 మొక్కలకు తగ్గకుండా నాటాలని, ఆ ప్రాంతానికి ఫ్రీడమ్ పార్కుగా వ్యవహరించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో, మున్సిపాలిటీల పరిధిలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇతర ఖాళీ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే స్థలాన్ని అనుసరిస్తూ పెద్ద ఎత్తున అందమైన మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను, స్వచ్చంద సంస్థల బాధ్యులను, అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేయాలని అన్నారు. 11 వ తేదీన అన్ని మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఫ్రీడమ్ ర్యాలీ జరపాలని అన్నారు. 12 న జాతీయ సమైక్యతా రక్షా బంధన్ కార్యక్రమం చేపట్టాలని, 13 న ఎన్సీసీ, ఎన్ ఎస్ ఎస్, ఉద్యోగులు, ఉపాద్యాయులు, విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యం చేస్తూ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేలా ర్యాలీలు జరపాలని, 14 న సాయంత్రం 5 . 00 గంటల నుండి రాత్రి 8 . 00 గంటల వరకు తెలంగాణ సాంస్కృతిక కళాకారులచే జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని, కలెక్టర్ ఆదేశించారు. 15 వ తేదీన ఎప్పటిలాగే స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, ఉత్తమ సేవలందించిన వారికి అవార్డుల ప్రధానం ఉంటుందని పేర్కొన్నారు. 16 న జిల్లా వ్యాప్తంగా ప్రతి చోటా ఒకే సమయంలో జాతీయ గీతాలాపన ఉంటుందని, అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా నిర్ణీత సమయంలో ఈ కార్యక్రమం జరగాలని కలెక్టర్ ఆదేశించారు. 17 న అన్ని నియోజకవర్గాల స్థాయిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని, 18 న ఉద్యోగులు, యువతకు ఫ్రీడమ్ కప్ క్రీడా పోటీలు జిల్లా స్థాయిలో  చేపట్టాలని సూచించారు. అంతకు ముందే మండల స్థాయిలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాడ్మింటన్ అంశాల్లో పోటీలు నిర్వహించాలని అన్నారు. కాగా,19 న ఆసుపత్రులు, అనాధ, వృద్దాశ్రమాలు, జైళ్లలో పండ్ల పంపిణి చేపట్టాలని, 20 న అన్ని గ్రామ పంచాయతీలు, వార్డులలో రంగోలీ పోటీలు నిర్వహించాలని సూచించారు. 21 న అన్ని స్థాయిలలో ప్రజలు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేస్తూ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఐదవ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులందరికీ అన్ని సినిమా థియేటర్లలో ఈ నెల 9 వ తేదీ నుండి ఉదయం 10 . 00 గంటల నుండి మధ్యాహ్నం 1 . 15 గంటల వరకు ‘గాంధీ’ మూవీని ఉచితంగా ప్రదర్శించనున్న దరిమిలా, విద్యార్థులు భద్రతకు ఎనలేని ప్రాధాన్యతనిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. వజ్రోత్సవ వేడుకల శోభ ఉట్టిపడేలా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, అన్ని ముఖ్య కూడళ్లను అందంగా ముస్తాబు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,డి.అర్. ఓ.జగదీశ్వర్ రెడ్డి,డి.అర్.డి. ఓ. కాళింది నీ, డి.పి. ఓ.విష్ణువర్ధన్ ఎంపీడీవోలు ,ఎం.పి. ఓ.లు,తహశిల్దర్ లు,ఎం.ఈ. ఓ.లు పాల్గొన్నారు.

తాజావార్తలు