భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

– సెన్సెక్స్‌ 300 పాయింట్లు పతనం
ముంబయి, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి) :  దేశీయ మార్కెట్లు సోమవారం అనూహ్య రీతిలో భారీ నష్టాలను చవిచూశాయి. జీడీపీ గణాంకాల సానుకూలతలతో సోమవారం ఉదయం ఉత్సాహంగా సూచీలు ప్రారంభమయ్యాయి. కానీ ఆ జోరును కొనసాగించలేకపోయాయి. చివరి గంటల్లో వెల్లువెత్తిన అమ్మకాల సెగ మార్కెట్‌ను అమాంతం పడగొట్టింది. ఫలితంగా సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఏప్రిల్‌-జూన్‌ తైమ్రాసికంలో జీడీపీ రెండేళ్ల గరిష్ఠానికి చేరిందన్న వార్తలతో సోమవారం ఉదయం సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 140 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టగా.. నిఫ్టీ 11,700 మార్క్‌ పైన ట్రేడ్‌ అయ్యింది. అయితే ఆ లాభాలు ఎంతోసేపు నిలువలేదు. బ్యాంకింగ్‌, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఏ దశలోనూ కోలుకోలేని సూచీలు చివరకు భారీగా పతనమయ్యాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 332 పాయింట్లు దిగజారి 38,312 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ
98 పాయింట్ల నష్టంతో 11,582 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 71.5గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో రెడ్డీస్‌ ల్యాబ్స్‌, విప్రో, ఐషర్‌ మోటార్స్‌, టైటాన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం షేర్లు లాభపడగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.
—————————–