మంచి, చెడు ఆలోచించి ఓటేయాలి
– కాంగ్రెసోళ్లకు తెలివి లేదు
– వారు అధికారంలోకి వస్తే మళ్లీ కష్టాల్లో పడతాం
– మోడీ వచ్చి కరెంట్ ఇవ్వటం లేదని అబద్దాలు చెప్పిండు
– నాలుగేళ్ల అభివృద్ధి అంతా విూ కళ్లముందే ఉంది
– కాళేశ్వరం పూర్తయితే నిజాంసాగర్ నిండా నీళ్లే
– బాన్సువాడను పచ్చతోరణంలా తయారు చేస్తాం
– బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
నిజామాబాద్, నవంబర్28(జనంసాక్షి) : 60ఏళ్లకుపైగా పాలన సాగించిన కాంగ్రెస్, టీడీపీలు చేయలేని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్లలో చేసుకున్నామని, నాలుగేళ్ల అభివృద్ధి అంతా విూ కళ్లముందే ఉందని డిసెంబర్7న జరిగే ఎన్నికల్లో మంచి, చెడు ఆలోచించి ఓటేయాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం బాన్సువాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నిజాంసాగర్ 365 రోజులు నిండే ఉంటుందని, వర్షం పడ్డ, పడకపోయినా నాట్లు వేస్తూనే ఉంటామన్నారు. మే నెల(రోహిణి కార్తె)లో నార్లు పోయాలని, రెండో పంట మార్చిలోనే కోయాలని, అప్పుడే బంగారు తెలంగాణ తయారవుతుందని కేసీఆర్ తెలిపారు. సింగూర్ నుంచి నీళ్లు ఇవ్వాలని కొట్లాడిన వ్యక్తి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అని అన్నారు. ఇప్పుడు నిజాం సాగర్ నిండా నీళ్లు ఉన్నాయని, నిజాం సాగర్ విూద జాకోర్, చందూర్ వద్ద లిఫ్ట్ లు నిర్మిస్తున్నామని, ఎన్నికల ఫలితాల తర్వాత నెలలోపు ఆ లిఫ్ట్ లకు శంకుస్థాపన చేసి ఏడాది లోపు లిఫ్ట్ లు పూర్తి చేసి బాన్సువాడను పచ్చతోరణంలా తయారు చేస్తామని కేసీఆర్ హావిూ ఇచ్చారు. చందూర్, మోస్తరను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని, బాన్సువాడకు డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తామని హావిూ ఇస్తున్నానని అన్నారు. పోచారంను గెలిపించుకుంటే బాన్సువాడ మరింత అభివృద్ధి చెందుతోంది, భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసోళ్లకు తెలివి లేదని, వారు అధికారంలోకి వస్తే కరెంట్ ఖతమైతదన్నారు. నిజామాబాద్ కరెంట్ లేదని నరేంద్ర మోదీ పచ్చి అబద్ధం మాట్లాడారని, కరెంట్ ఎలా ఇస్తాన్నామో విూ కళ్లముందే ఉందని ఓటు వేసేటప్పుడు మంచి, చెడ్డలు ఆలోచించి ఓటు వేయాలని, అబద్దాల కోరులకు బుద్దిచెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, అభివృద్ధి అంతా ప్రజల కండ్ల ముందే ఉందన్నారు. రాష్ట్ర సంపదను పెంచి రైతులకు, పేదలకు పంచుతున్నామని, తెలంగాణలో గత పాలకులు ఇండ్లు కట్టి ఉంటే గరీబోడు ఎట్ల ఉంటడని అన్నారు. ఇప్పటికీ గరీబోళ్లు ఉన్నరు కాబట్టే డబుల్ బెడ్ రూం ఇండ్లు కడుతున్నామని, కొంచెం ఆలస్యమైన ఫరవా లేదు కానీ.. రెండు తరాలకు ఉపయోగపడే విధంగా ఇండ్లు నిర్మిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టామని, నీటి తీరువా పన్నులు రద్దు చేశామని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రూ. లక్ష రుణమాఫీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కచ్చితంగా తెలంగాణలో టీఆర్ ప్రభుత్వమే ఏర్పడుతోందని, ఎక్కడ పోయినా టీఆర్ సభల్లో మానవ సముద్రం కనబడుతోందని, మన సభలకు వచ్చినంత మంది కూడా బీజేపీ సభలకు రావడం లేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. పోచారం వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత రైతాంగం దశ మారిపోయిందని, పోచారం పేరే లక్ష్మీపుత్రుడని, ఆ లక్ష్మీపుత్రుడి వల్ల రైతులకు లాభం
చేకూరుతోందన్నారు.