మంచి నీటి కోసం..

యూఏఈ భగీరథ ప్రయత్నం
– అంటార్కిటికా నుంచి మంచుకొండలను లాగి నీటికొరతను తీర్చేలా చర్యలు
దుబాయ్‌, జులై2(జ‌నం సాక్షి ) : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో తాగునీటి కొరత సమస్యను తీర్చేందుకు ఆ దేశం ఎవరూ ఊహించని రీతిలో వినూత్న ప్రాజెక్టుతో ముందుకువస్తోంది. అంటార్కిటికా నుంచి భారీ మంచు కొండలను యూఏఈ తీర ప్రాంతాలకు తరలించి వాటిని కరిగించి మంచినీటిని సేకరించేందుకు భారీ ప్రణాళికలు రచిస్తోంది. అత్యాధునిక సాంకేతికత సాయంతో, భారీ వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను స్థానిక సంస్థ ఒకటి ఓ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించి వివరించింది. ఈ ప్రాజెక్టులో ఎన్ని దశలు ఉంటాయి, ఆర్థికంగా, పర్యావరణం పరంగా కలిగే ప్రయోజనాలను ఇందులో పేర్కొంది. నేషనల్‌ అడ్వైజర్‌ బ్యూరో లిమిటెడ్‌ అనే సంస్థ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లనుంది. అంటార్కిటికా నుంచి భారీ మంచుకొండలను యూఏఈ తీరప్రాంతాలకు లాకెళ్లనున్నారు. ఇందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. 2020 ప్రథమార్ధం నాటికి భారీ మంచుకొండలు యూఏఈకి చేరుకోనున్నాయని ఆ సంస్థ చెబుతోంది. ఈ ప్రాంతంలో కొత్త నీటి వనరులుగా వీటిని మారుస్తామని వెల్లడించింది. కాగా, ఈ ప్రాజెక్టుకయ్యే ఖర్చు 50 నుంచి 60 మిలియన్‌ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పైలట్‌ దశను 2019 ద్వితీయార్ధంలో మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకమైన సాంకేతికతను అభివృద్ధి చేసి ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించే పనిలో ఆ కంపెనీ ఉంది. అలాగే ఈ ప్రాజెక్టులో మరో రిస్క్‌ ఏంటంటే.. మంచు దిబ్బలు తరలించే సమయంలో సముద్రంలోనే కరిగిపోయే ప్రమాదం ఉంది. అయితే అవి అలా కరగకుండా ఉండేందుకు కూడా నూతన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు తక్కువ ఖర్చుతోనే శుద్ధమైన తాగునీటిని అందించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇందుకు సంబంధించిన వివరాలను అక్కడి విూడియా పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు మొదటిసారిగా 2017 మేలో యూఈఏ విూడియాలో వచ్చాయి.