మంటపాల ఏర్పాటుకు పోలీస్ అనుమతి తప్పనిసరి
విద్యుత్ అధికారుల ద్వారానే కరెంట్ సరఫరా
అనంతపురం,సెప్టెంబర్4(జనం సాక్షి): జిల్లాలో ఘనంగా జరుపుకునే వినాయక చవితి పర్వదిన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వినాయక ప్రతిమల ఏర్పాటు కోసం ఆయా స్టేషన్లలో దరఖాస్తు చేసుకుని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రజల రాక పోకలకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా మంటపాలు, ప్రతిమలు ఏర్పాటు చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. సంబంధిత పోలీసు అధికారులు తప్పనిసరిగా ఆయా ప్రాంతాలను సందర్శించి అనువైన ప్రదేశమా కాదా, ప్రజలకు, వాహన రాకపోకలకు ఏమైనా అసౌకర్యం కలిగే అవకాశముందా అని పరిశీలించాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు మున్సిపల్ అధికారుల సూచనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. మంటపాల్లో అధికారికంగా విద్యుత్ ఏర్పాటు చేసుకునేలా సూచించాలన్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారుల అనుమతితో విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలన్నారు. గత ఏడాది వినాయక చవితి వేడుకల్లో అనధికారిక విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం వల్ల వివిధ ప్రాంతాల్లో కొందరు యువకులు చనిపోయారని,ఈసారి ఆ తరహా ఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలనే విద్యుత్ శాఖ అధికారులతో తప్పనిసరిగా అనుమతి తీసుకునేలా జాగ్రత్తలు చేపట్టామని చెప్పారు. మంటపాల పరిసరాలలో మద్యం, జూదం, రికార్డు డ్యాన్సుల్లాంటి కార్యకలాపాలు చేపట్టరాదన్నారు. రాజకీయ ప్రసంగాలు, నినాదాలకు తావివ్వరాదని… వ్యక్తుల, సమూహాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించరాదని తెలిపారు. భారీ మంటపాలు ఏర్పాటు చేసుకునే వారు తప్పనిసరిగా రికార్డింగ్ సదుపాయమున్న సిసి.కెమెరాలు అన్ని ఎంట్రీ, ఫార్కింగ్ స్థలాల్లో అమర్చుకోవాలన్నారు. బలవంతపు నిధుల సేకరణ జరుగరాదన్నారు. ప్రతిమల ఏర్పాటు నుంచీ నిమజ్జనం వరకూ పోలీసు గస్తీ, నిఘా కొనసాగాలన్నారు. మంటపాల పరిసరాల్లో ఈవ్ టీజింగ్ , తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగకుండా ఉండేలా దష్టి సారించాలన్నారు.
——–