మండలాల కోసం జనం ఆందోళన

కొత్త మండలాలపై పలుచోట్ల నిరసన
సోనాల, మల్లంపల్లిల కోసం ధర్నాలు

హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): మండలాల ఏర్పాటుపై పలు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌ మండలం సొనాలలో రెండో రోజు గ్రామస్తులు వర్షంలోనే రాస్తారోకో చేపట్టారు. గొడుగులు పట్టుకుని బోథ్‌`కిన్వట్‌ అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. సోనాలను మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మండలంగా చేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీకే చెందిన నాయకులు ఆందోళన నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హావిూని నిలబెట్టుకోవాలని, సోనాలను మండలంగా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. మండలానికి ఉండాల్సిన అన్ని అర్హతలు సోనాలకు ఉన్నాయని, సొనాలకు దగ్గరగా ఎన్నో ఆదివాసీ గిరిజన పల్లెలు ఉన్నాయని… ఈ పల్లె ప్రజలు బోథ్‌ మండల కేంద్రానికి వెళ్లాలంటే 20 కిలోవిూటర్ల దాకా దూరం ఉందని అంటున్నారు.
గిరిజనుల రాకపోకలకు కష్టంగా ఉందని, వెంటనే సొనాలను మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మండలం సాధించే వరకు రోజూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావ్‌ నుంచి స్పష్టమైన హావిూ వచ్చేవరకు దశల వారిగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ములుగు జిల్లాలోని మల్లంపల్లిని మండలం చేయాలని గ్రామస్థులు ధర్నా చేశారు. మొన్న ప్రభుత్వం ప్రకటించిన మండలాల లిస్టులో తమ ఊరి పేరు లేకపోవడంపై మల్లంపల్లి వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగు`హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండలంగా ప్రకటించాలంటూ ఓ కొందరు యువకులు కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. నారాయణఖేడ్‌ మండలం ర్యాలమడుగు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తమను కొత్తగా ఏర్పాటు చేసిన నిజాంపేట్‌ మండలంలో కలుపుతున్నారని.. తమకు దూరభారం అవుతుదని ఆందోళన వ్యక్తం చేశారు. తమను నారాయణఖేడ్‌ మండలంలోనే కొనసాగించాలని కోరుతూ గ్రామస్తులు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. తమ
గ్రామాన్ని నూతనంగా ఏర్పడ్డ నిజాంపేట్‌ లో కలుపొద్దని గ్రామస్థులందరూ ఏకగ్రీవ తీర్మానంతో రాసిన వినతిపత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు.

తాజావార్తలు