మంత్రి పేర్నినానిపై దాడి ఘటన.. అన్నికోణాలలో దర్యాప్తు
నిందితుడు టిడిపికి చెందిన వ్యక్తిగా గుర్తింపు: ఎస్పీ
మచిలీపట్నం,నవంబర్29 (జనం సాక్షి): మంత్రి పేర్ని నానిపై దాడి ఘటనపై అన్నికోణాలలో దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఆదివారం ఉదయం 11:30 గంటలకు మంత్రి పేర్నినాని పై ఆయన నివాసం వద్ద దాడి జరిగిందన్నారు. నిందితుడు తాపీ పనిచేసే బడుగు నాగేశ్వరరావు.. అతని దగ్గరున్న తాపీతో రెండు సార్లు కడుపులో పొడవటానికి ప్రయత్నించాడని చెప్పారు. మొదటిసారి పొడిచినపుడు బెల్ట్‌కి గుచ్చుకోవడంతో మంత్రి అప్రమత్తమై అతనిని వెనక్కి నెట్టారు. వెంటనే మంత్రి గన్‌మెన్, సెక్యూరిటీ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారిస్తున్నామని పేర్కొన్నారు. నిందితుడు నాగేశ్వరరావు టీడీపీ సానుభూతిపరుడని, నాగేశ్వరరావు సోదరి ఉమాదేవి టీడీపీ మండల నాయకురాలిగా పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు. మంత్రిపై హత్యాయత్నంలో ఎవరి హస్తముందో
దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, పూర్తి కారణాలు తెలియాల్సి వుందని ఆయన తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం నిందితుడిని ఆసుపత్రికి పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఇది రాజకీయ కోణమా.. లేక మరేదైనా ఉద్దేశమా అనేది విచారణలో తెలియాల్సివుంది. మంత్రి పేర్నినానిని కలిసి బాధను చెప్పుకోడానికి వచ్చినట్లు నిందితుడు చెబుతున్నాడు.. కానీ నిజమెంతో తెలుసుకోవాల్సి ఉంది. బాధ చెప్పుకునే వ్యక్తి.. ఆయుధంతో ఎందుకు వచ్చాడో విచారిస్తున్నాం. తాజా ఘటన నేపథ్యంలో మంత్రి భద్రతపై ఏఆర్ ఎఎస్పీతో సవిూక్షిస్తామని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. మంత్రి పేర్నినానిపై హత్యాయత్నాన్ని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఖండించారు. ఆయన మంత్రి పేర్ని నానిని పరామర్శించి, దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలు రాబట్టాలన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆళ్ల నాని అన్నారు.