మందగమనం పాపం ఎవరిది?
ఆర్థిక మందగమనంపై దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. దీనికితోడు గత ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ దీనికి కారణమని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సెలవిచ్చారు. మెల్లగా తన తప్పులను కేంద్రం తప్పించు కోవాలని చూస్తున్నట్లుగా ఉంది. లేకుంటే ఇలాంటి ప్రకటన చేస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి. గత మూడు సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పడడం ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ నిర్వాకమేనని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆరోపించారు. మూడు సంవత్సరాల విరామం తర్వాత 2018-19 సంవత్సరం మొదటి తైమ్రాసికంలో ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకు ముందు వరుసగా ఆరు తైమ్రాసికాల్లో వృద్ధిరేటు దిగజారుతూ వచ్చిందని, రాజన్ అనుసరించిన విధానాలే ఇందుకు కారణమని రాజీవ్ కుమార్ అన్నారు. బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు పతాక స్థాయికి చేరడం కూడా కారణంగా చెప్పుకోవాలి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఎన్‌పిఎలు 4 లక్షల కోట్ల రూపాయలుండగా 2017 మధ్య నాటికి 10.5 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఎన్‌పిఏలు పెరుగుతున్న కొద్ది వృద్ధిరేటు క్షీణిస్తూ వస్తున్నదని చెప్పారు. రాజన్ హయాంలో ఎన్‌పిఏల గుర్తింపునకు కొత్త విధానం ప్రవేశపెట్టారని, ఫలితంగా పారిశ్రామిక రంగానికి రుణాలు ఇవ్వడాన్ని బ్యాంకులు నిలిపివేశాయని రాజీవ్ కుమార్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే పారిశ్రామిక రంగానికి రుణాలు ఏ మాత్రం అందుబాటులోకి రాకపోవడంతో మార్కెట్‌లో మాంద్యం ఏర్పడిందని, అది జిడిపి వృద్ధిరేటు దిగజారడానికి దారి తీసిందని ఆయన విశ్లేషించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకైతే రుణవితరణలో ప్రతికూల వృద్ధి నమోదయిందని ఆయన అన్నారు. దేశ చరిత్రలో పారిశ్రామిక రంగానికి వాణిజ్య రుణాలు భారీగా తగ్గడం కూడా ఇదే ప్రథమమని ఆయన అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలను గణనీయంగా పెంచడం ద్వారా ఆ లోటును పూడ్చిందని రాజీవ్ కుమార్ చెప్పారు. నిజంగా ఇది ఎంతవరకు నిజమో కానీ ప్రభుత్వ పలాయనవాదాన్ని సూచిస్తోంది. అంతర్జాతీ యంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటం, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, టర్కీ, అర్జెరటీనా దేశాల కరెన్సీలు దారుణంగా పతనమవడం వంటి అంశాలు మన విదేశీ మారకపు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. రూపాయి క్షీణత ఇలాగే కొనసాగితే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే మన దేశానికి ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు. వాణిజ్యలోటు, కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం పెరిగేందుకు రూపాయి పతనం పరోక్షంగా దోహదపడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రూపాయి క్షీణతతో దిగుమతులు భారమవుతాయి. చమురు, పసిడి దిగుమతుల వ్యయాలు పెరిగితే, దేశ వాణిజ్య లోటు అధికమవుతుంది. దిగుమతుల కోసం విదేశీ మారకపు నిల్వలను అధికంగా ఖర్చు చేయాల్సి రావడంతో, కరెంటు ఖాతా లోటు కూడా పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు, చదువుల ఖర్చులు భారమవుతాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో రవాణా వ్యయాలు పెరిగి సరకులు ప్రియమవుతాయి. అప్పుడు ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో పారిశ్రామిక ప్రగతిపై నీలినీడలు కమ్ముకుంటాయి. పరోక్షంగా ఇది దేశ అభివృద్ధిని అడ్డుకుంటుంది. దీంతోపాటు డాలర్ బలపడుతున్నందున, విదేశీ మదుపర్లు దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తే, ఈక్విటీ మార్కెట్లు నష్టపోతాయి. లీటరు పెట్రోలు వంద రూపాయలు చేసేస్తారేమో. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనమవుతోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చింది. దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆర్థిక వ్యవస్థ ఇంతకన్నా మెరుగ్గానే
ఉండేదని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా నిరుద్యోగం పెరుగుతున్నది. మరోవైపు ప్రైవేట్ పెట్టుబడులు తగ్గుతున్నవి. ప్రభుత్వ ఉద్యోగాలకోసం యువత ఎదురుచూడటం ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నది. ఇలాంటి తక్షణ, అత్యవసర సమస్యల పరిష్కారంపట్ల దృష్టిసారించాల్సిన పార్టీలు నిర్లిప్తంగా ఉంటున్నాయి.రాజకీయాలు నెరిపే పార్టీలు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కేంద్రంగా వ్యవహరిం చాలి. కానీ ఇవేవీ వస్తుగత విషయాలు చేయకుండా నేడు పార్టీలు వ్యవహరిస్తుండటం గమనార్హం. ఈ మధ్య బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ హయాంలో వృద్ధిరేటు ఎక్కువ ఉందంటే తమ హయాంలోనే అని వాదులాడుకున్నాయి. కానీ జరుగుతున్న అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, ఫలాల పంపకం ఏ రీతిన ఉన్నదో చూడడం లేదు. అభివృద్ధి అన్నది ఉద్యోగ కల్పనకు గీటురాయిగా ఉండాలి. మొత్తానికి ఇప్పట్లో ఆర్థిక రంగం కోలుకునేలా కనిపించడం లేదు. కేవలం చమురు ధరలు చూపి తప్పించుకోలేరు. ఏదేమైనా డాలర్త్‌ఓ మారక విలువను ఆధీనంలోకి తెచ్చుకోకపోతే మరిన్ని కష్టాలు తప్పవు. అలాగే ఎగుమతులకు ప్రాధాన్యం పెరగాలి. అనవసర దిగుమతులకు కల్లెం వేయాలి. లేకుంటే విదేశీఅ మారక నిల్వలపై తీవ్రప్రభావం చూపనుంది. దీంతో రూపాయి మరింత బలహీన పడనుంది.