మణుగూరులో… డెంగ్యూతో నాలుగేళ్ల బాలుడు మృతి
ఖమ్మం, ఆగస్టు 16 : ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలను డెంగ్యూ, మలేరియా జ్వరాలు వణికిస్తున్నాయి. మలేరియాతో వెంకటాపురం మండలంలో గత రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి మృతిచెందిన విషయం మరిచిపోకముందే… తాజాగా మణుగూరు మండలంలో డెంగ్యూతో మరో నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. మణుగూరు మండలం సమితిసింగారం గ్రామంలో తేజస్వి(4) అనే బాలుడు డెంగ్యూతో శనివారం మృతిచెందాడు. గత నాలుగు రోజలుగా జిల్లాలో వస్తున్న వర్షాలు, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల చాలామంది జ్వరాల బారిన పడుతున్నారు. ఏజెన్సీలోని కొన్ని గ్రామాల్లో ఇంటికొకరు జ్వరపీడితులున్నారని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా వైద్యఆరోగ్య శాఖాధికారులు తమ నిద్రమత్తును వీడడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. ప్రస్తుతం డెంగ్యూతో మృతిచెందిన బాలుడి తండ్రి నరసింహరావు కూడా మలేరియాతో బాధపడుతున్నాడని తెలిసింది.