మన తెలుగుతల్లికి మల్లె పూదండ వేసి సుందరాచారి


ఆయన జయంతి సందర్బంగా నివాళి
తిరుపతి,ఆగస్ట్‌10(జనం సాక్షి): ’మా తెలుగుతల్లికి మ్లలెపూదండ’లల్లినవాడు…ప్రతి రోజూ వేలాది పాఠశాలల్లో లక్షలాది విద్యార్థులు మన రాష్ట్ర గీతమైన ’మా తెలుగు తల్లికి మ్లలెపూల దండ’ని రాగయుక్తంగా
ఆలపిస్తుంటారు. కానీ ఈ తరం విద్యార్థులకు గేయ రచయిత గురించి పెద్దగా తెలియదు. ఆంగ్ల మాధ్యమం పాఠశాలలు పెరిగిన నేపథ్యంలో ఆయా పాఠశాలల యాజమాన్యాలు తెలుగుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఫలితంగా ’మా తెలుగు తల్లి’ గేయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. ఇక గీత రచయిత శంకరంబాడి సుందరాచారి గురించి తెలిసే అవకాశం లేదు. ’సుందర కవి’గా పేరు పొందిన సుందరాచారి 1914 ఆగస్ట్‌ 10న తిరుపతి పట్టణంలో రాజగోపాలయ్య, కమలమ్మ దంపతులకు జన్మించారు. ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం విూకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించిన ధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆం ధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పం తులు కాగా ఎదురు ప్రశ్నించింది శంకరంబాడి సుందరాచారి. తన పై అధికారి తిరుపతికి వచ్చి చేతి సంచిని అందివ్వబోతే తిరస్కరించి, ఆఫీసు జవానుకు, ఇన్‌స్పెక్టరుకు తేడా తెలియని వ్యక్తి విద్యాశాఖలో ఉండటం గర్హనీయమంటూ వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆత్మాభిమానం ఆయనది. ఉద్యోగం కోసం, హోదా కోసం, పేరు కోసం ఎవరినీ యాచించని, చేయిచాపని ఈ గుణం వల్లే జాతి మాతకు మ్లలెపూదండలు గుచ్చి రచించిన ఆ రసరమ్య గీతకర్త ఎవరో కూడా దశాబ్దాల పాటు కనుమరుగైపోవడం నాటి చరిత్ర. హైదరాబాద్‌లో 1975 ఏప్రిల్‌ 12న ఉగాదినాడు తొలి తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమై ఆరురోజుల పాటు వైభవంగా జరిగాయి. ఆ సభ ప్రారంభంలో మా తెలుగుతల్లికి గీతాన్ని ఆలపించడానికి టంగుటూరు సూర్యకుమారిని ఇంగ్లండ్‌ నుంచి పిలిపించి పాడిరచారు. ఆ సమయంలో సదరు గేయకర్త ఎవరు అనే ప్రశ్న అక్కడున్న వారికి వచ్చింది. అక్కడే సభలో దూరంగా వెనుకవైపు ఒక వ్యక్తి చిరిగిన బట్టలతో, దయనీయ స్థితిలో నిలబడి ఉన్నాడు. ఆయ నెవరో కాదు శంకరంబాడి సుందరాచారి. అక్కడున్న కొంతమంది ఆయనను గుర్తించారు. వేదికపై ఉన్న మహాసభల నిర్వాహకులు మండలి వెంకట కృష్ణారావు స్వయంగా సుందరాచారిని వేదికపైకి తీసుకెళ్లి సత్కరించి, ప్రభుత్వం తరపున 250 రూపాయల జీవితకాల గౌరవవేతనం ప్రకటించింది.