మమతకు సుప్రీం షాక్‌

పంచాయితీ ఎన్నికల వరకు ఫలితాల నిలుపుదల
న్యూఢిల్లీ,మే10(జ‌నం సాక్షి): సుప్రీం కోర్టు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి  ఊహించని షాక్‌ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవంపై సుప్రీం కోర్ట్‌ స్టే విధించింది. ఈ నెల 14న నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీ ఫలితాలను జులై మూడు వరకూ ప్రకటించొద్దని అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల కవిూషన్‌ను ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో తృణముల్‌కు గట్టి దెబ్బ తగిలిందని రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం సీట్లు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 58,692 పంచాయతీ స్థానాలకుగాను 20,000 పంచాయతీల్లో విపక్ష పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఆ స్థానాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించినట్లయింది. రాష్ట్ర చరిత్రలో ఇంత మొత్తంలో సీట్లు ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారి.ఆ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు, 18 వేల పంచాయతీల్లో తృణమూల్‌ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేయడంతో సుప్రీంకోర్ట్‌ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఎన్నికలు జరిగిన పంచాయతీల ఫలితాలు మాత్రమే ప్రకటించాలని సుప్రీంకోర్ట్‌ స్పష్టం చేసింది. ఎన్నికలు జరగని పంచాయతీల ఫలితాలు జులై 3 వరకు వెల్లడించవద్దని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 14న పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని చెప్పింది. మరోవైపు, ఈ-మెయిల్‌ ద్వారా అభ్యర్థులు పంపించే నామినేషన్లను ఆమోదించాలని కోల్‌ కత్తా హైకోర్ట్‌ ఇచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్ట్‌ పక్కన పెట్టింది.