మరమగ్గ కార్మికుల కూలీ రేట్లు పెంచాలి
కరీంనగర్, జూలై 31 : మరమగ్గాల కార్మికుల కూలీ రేటు పెంచాలని కోరుతూ మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండగా కార్మికులకు చెల్లిస్తున్న దినసరి కూలీ రేటు సరిపోక కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయని అన్నారు. పెరుగుతున్న వస్తువుల ధరలకు అనుగుణంగా కార్మికుల కూలీరేట్లను పెంచి వారిని రోడ్డున పడకుండా ప్రభుత్వం చూడాలని వారు కోరారు. కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం వంటి సదుపాయాలు అందించాలని, కార్మిక కుటుంబాలకు ఉచితంగా గృహాలు నిర్మించి ఇవ్వాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడకుండా, వారి జీవితాలు బుగ్గిపాలు కాకుండా చొరవ చూపి వెంటనే వారి కూలీ రేట్లను పెంచి ఆదుకోవాలని కార్మిక సంఘం నాయకులు కోరుతున్నారు.