మరిన్ని సేవలందిస్తాం
శ్రీకాకుళం, జూలై 19: సేవ దృక్పథంతో వ్యవహరించి మంచి సేవలను ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ పిలుపునిచ్చారు. మీ సేవ కార్యక్రమం ద్వారా వివిధ ధ్రువీకరణ పత్రాల జారీపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం తహశీల్దార్లు, మీ సేవా నిర్వాహణకులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు పనులు త్వరితగతిన అందుతాయన్నారు. మీ సేవ చాలా ముఖ్యమైన కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అన్ని సేవలు మీ సేవ ద్వారానే అందుతాయని ఆయన చెప్పారు. సానకూల దృక్పథంతో పనిచేయాలని హితవు పలికారు. కార్యలయాల్లో పౌరసేవా పట్టిక, వాటికి పట్టే సమయం సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజు మీ సేవ ద్వారా జరిగిన కార్యక్రమాలపై నివేదికను పరిశీలించాలని అన్నారు. డివిజన్‌లో అన్ని మండలాల పనితీరును రెవెన్యూ డివిజనల్ అధికారులు పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. ధ్రువీకరణ పత్రాల జారీలో చేసే జాప్యం స్పష్టంగా తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌భాషా ఖాసీం, రెవెన్యూ డివిజనల్ అధికారులు దామోదర్‌రావు, దయానిధి, విశ్వేశ్వరరావు, తహశీల్దార్లు, మీ సేవా నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.