మరుగుదొడ్డి విధిగా వాడాలి
గ్రామంలోని ప్రతి పౌరుడు, పౌరురాలు విధిగా మరుగుదొడ్డి వాడడం అందరి సామాజిక బాధ్యత అని సర్పంచ్ దశమంత రెడ్డి అన్నారు. స్వచ్ఛతారన్ కార్యక్రమంలో భాగంగా నంగునూరు మండలం ఖాతా గ్రామంలో శనివారం సర్పంచ్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, ప్రజలతో కలసి స్వచ్ఛతారన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ప్రస్తుత రోజుల్లో మరుగుదొడ్లు వాడే ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. పల్లెల్లో అంటువ్యాధులు ప్రబలడానికి ముఖ్య కారణం బహిరంగ మలవిసర్జన కారణమని గుర్తుచేశారు. కావున గ్రామంలో అంటువ్యాధులను దూరం చేసి ప్రజలు ఎల్లవేళలా ఆరోగ్యంతో ఉండాలంటే బహిరంగ మలవిసర్జన మానేసి మరుగుదొడ్ల వాడకం మొదలు పెట్టాలన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం మరుగుదొడ్డి కలిగి ఉండాలని, లేనియెడల వెంటనే నిర్మించుకోవాలని గ్రామ ప్రజలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వాణి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ రెడ్డి, సిఏ భాస్కర్, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు