మరోమారు ఎమ్మెల్యేగా గెలిపించండి

ప్రచారంలో సోమారపు పిలుపు

రామగుండం,నవంబర్‌14(జ‌నంసాక్షి): మరోసారి సీఎంగా కేసీఆర్‌ను తనను ఎమ్మెల్యేగా గెలిపించి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. టిఆర్‌ఎస్‌తోనే అభివృద్ది సాధ్యమని అన్నారు. మహాకూటమి అభ్యర్థులకు ఓటమి తప్పదనీ పేర్కొన్నారు. సింగరేణిని ఆదుకున్న ఘనత, ఆర్టీసిని ఆదుకున్న ఘనత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదన్నారు. మాయాకూటమి పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ప్రజల వద్దకు వస్తున్నారనీ, వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం అసన్నమైందన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలన్నారు. రైతు బంధు తో పాటు రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దక్కిందన్నారు. తనకు ఎమ్మెల్యేగా మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తాననిపేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రాప్రాంత నాయకులను తరిమికొడితే, మళ్లీ వారిని చంకనెక్కించుకుని వస్తున్నారని అన్నారు. ప్రజల సం క్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టాలనీ కోరారు. ఎన్నికల ప్రచారానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో పాటు ర్యాలీ చేపట్టారు.