మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
హైదరాబాద్‌,అగస్టు4(జనం సాక్షి): రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ నెల7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజగిరి, మహబూబాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. శుక్రవారం కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మహమబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. 6న రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోవిూటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

తాజావార్తలు