మరో మూడ్రోజులు భారీ వర్షాలు

వాతావరణశాఖ హెచ్చరిక
మూసీ పరివాహకంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు కురితో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టులు, నదుల్లోకి వరద పెరిగింది. లోతుట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో మరో మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. మంగళవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.
బుధవారం నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. గురువారం సైతం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడిరచింది. హైదరాబాద్‌ నగరంలో జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చాదర్‌ ఘాట్‌, మూసారాంబాగ్‌
బ్రిడ్జిల వద్ద మూసీ ప్రవాహం ప్రమాదకరంగా మారింది. బాపూఘాట్‌, శంకర్‌ నగర్‌, చాదర్‌ ఘాట్‌, మూసారాంబాగ్‌ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది. వికారాబాద్‌ , చేవెళ్ల ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండటంతో జంట జలాశయాలకు వరద పోటెత్తింది. ఉస్మాన్‌ సాగర్‌కు 2400 క్యూసెక్కులు ఇన్‌ఎª`లో వచ్చి చేరుతోంది. అలాగే అవుట్‌ ప్లో 2442 క్యూసెక్కులుగా ఉంది. దీంతో జలమండలి అధికారులు ఉస్మాన్‌ సాగర్‌ నుంచి ఆరు గేట్లు 4 ఫీట్ల మేర ఎత్తి మూసిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌ సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 1787.20 అడుగులకు చేరింది. అటు హిమాయత్‌ సాగర్‌కు 1200 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తోంది. దీంతో అధికారులు సాగర్‌ నాలుగు గేట్ల ద్వారా మూసిలోకి 1320 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్‌ సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 1760.90 అడుగులకు చేరింది. మరోవైపు నల్లగొండ జిల్లాలో మూసీ పరవళ్లు తొక్కుతోంది.