మలివిడత ప్రచారం కోసం కాంగ్రెస్‌ కసరత్తు

1న ప్రచారం చేపట్టనున్న నటి ఖుష్బూ

అభ్యర్థుల ప్రకటన తరవాత ఊపందుకోనున్న ప్రచారం

మహబూబ్‌నగర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఇప్పటికే రెండువిడతల ప్రచారం పూర్తి చేసుకున్న కాంగ్రెస్‌ జిల్లాలో

దీపావళి తరవాత దూకుడు పెంచనుంది. డిసెంబరు 1న సినీనటి ఖుష్బూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో

మహాకూటమి అభ్యర్థులకు మద్దతుగా పర్యటించనున్నారు. దీంతోపాటు నియోజకవర్గాల వారీగా సభలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి పీసీసీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఏఐసీసీ నేతలు హాజరుకానున్నారు. నామినేషన్ల పక్రియ ముగిసిన తర్వాత మహాసభలకు సంబంధించిన షెడ్యూలు ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇకపోతే ఈ నెల 8 లేదా 9వ తేదీన మహాకూటమి అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు మూడు స్థానాలు మినహా మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన లాంఛనమే. పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించగానే కాంగ్రెస్‌ అగ్రనేతలను పాలమూరులో దింపాలని అధిష్ఠానం ఆలోచిస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ సభను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రచార కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. గద్వాలలో రాహుల్‌ సభను ఏర్పాటు చేయాలని డీకే అరుణ పట్టుబడుతున్నట్లు సమాచారం. అక్కడ వీలుకాకపోతే మహబూబ్‌నగర్‌ లేదా దేవరకద్రలో సభ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. చిన్నారెడ్డి, డికె అరుణ, నాగం జనార్దన్‌ రెడ్డి, రేవంత్‌రెడ్డిల సీట్లు దాదాపు ఖాయం కాగా మిగతా సీట్లలో పొత్తులను బట్టి అభ్యర్థులను ప్రకటిస్తారు.మరోవైపు భాజపా కేంద్రమంత్రులతో బహిరంగ సభలను ఏర్పాటు చేయనుంది. మక్తల్‌లో జేపీ నడ్డా, కల్వకుర్తిలో సదానందగౌడ ఇప్పటికే ప్రచారాలు నిర్వహించారు. భాజపా మూడో జాబితా ప్రకటించిన తర్వాత మరికొందరు కేంద్రమంత్రులతో పాలమూరు జిల్లాలో ప్రచారం నిర్వహించాలని అధిష్ఠానం భావిస్తోంది. దీంతోపాటు కర్ణాకటకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుంటున్నారు. తెరాస అధినేత కేసీఆర్‌ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది. ముందుగా మంత్రుల నియోజకవర్గాలైన జడ్చర్ల, కొల్లాపూర్‌లో కేసీఆర్‌ బహిరంగసభలు ఉంటాయి. తర్వాత జిల్లా కేంద్రాలైన మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, గద్వాలలో రోడ్డు షోలతోపాటు కూడలి సభలు నిర్వహించడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వీటికితోడు మిగతా నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్‌ సభలు ఉంటాయి. ఇవన్నీ నామినేషన్ల పక్రియ పూర్తి అయిన తర్వాతనే ఉంటాయని భావిస్తున్నారు. మొత్తానికి దీపావళి తరవాత ప్రచారం¬రు మరింత పెరగనుంది