మళ్లీ అధికారంలోకి వస్తే 24 గంటలు మంచినీరు

` ధరణిని తీసేసి భూ భారతి తెస్తరట..
` మళ్ల గదే పైరవీకారులు, గదే దళారీలు
` ఆదో దోకాబాజ్‌ పార్టీ
` బీజేపాయిన గెలిస్తే ఏకాణ పనిగాదు..
` బీఆర్‌ఎస్‌ ప్రజాఆశీర్వాద సభల్లో కేసీఆర్‌
కరీంనగర్‌ బ్యూరో,హుజూరాబాద్‌,చొప్పదండి,పరకాల (జనంసాక్షి):పైరవీకారులు, దళారీలు, భూకబ్జాల దందాతో కాంగ్రెస్‌ వస్తుంది.. దయచేసి రైతులు అప్రమత్తంగా ఉండాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని గంగుల కమలాకర్‌కు మద్దతుగా ప్రసంగించారు. ధరణి పోర్టల్‌ ద్వారా అద్భుత ఫలితాలు వచ్చాయి. భూముల పంచాయితీలు తగ్గాయి. మునుపటి లాగా పైరవీకారులకు, దళారులకు ఆస్కారం లేకుండా పోయింది. రైతుబంధు డబ్బులు ధరణి పోర్టల్‌ ద్వారా విూ ఖాతాలో వచ్చి పడుతున్నాయి. విూరు పెట్టుబడికి వాడుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ ధరణి రద్దు చేస్తామని మాట్లాడుతోంది. ధరణి రద్దు చేస్తే అడ్డగోలుగా లంచాలు, పైరవీకారులు, దళారులు. కాంగ్రెస్‌కు అధికారం వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తరట. మరి రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి. మళ్లా పైరవీకారులు, దళారులు.. మళ్లీ మొదటికి వస్తది అని కేసీఆర్‌ తెలిపారు.  వడ్లు పండిరచడంలో తెలంగాణ పంజాబ్‌ను దాటిపోయి దేశంలో నంబర్‌ వన్‌ అయిందని కేంద్రం ప్రకటించింది. పంటలు దిగుబడి పెంచి, ఆదాయం పెంచి పేదలను ఆదుకుంటూ ముందుకు పోతుంటే కాంగ్రెస్‌ నాయకులు అడ్డు పడుతున్నారు. రైతులోకం సిరీయస్‌గా ఆలోచించాలి. రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్టం చేశాం. వ్యవసాయాన్ని పటిష్టం చేశాం. రైతుల ముఖాలు వెలుగుతున్నాయి, అప్పులు తీరిపోయాయి. దళారీల బాధ తప్పింది. పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. చెట్లు నరుడుకు తప్ప గతంలో చెట్లు నాటారా..? కరీంనగర్‌లో ఒకప్పుడు అడవి ఉండే.. మొత్తం అమ్మేసి కరగనాకేసిండ్రు. బీఆర్‌ఎస్‌ వచ్చిన తర్వాత చట్టం తెస్తే 7 శాతం గ్రీన్‌ కవర్‌ పెరిగింది. మంచి వర్షాలు కురుస్తున్నాయి. దీన్ని మళ్లీ చెడగొడుతాం. పైరవీకారులను తెస్తాం.. భూక్జబాలు మొదలు పెడుతాం అని దందాతో కాంగ్రెస్‌ వస్తుంది. దయచేసి రైతాంగం, కరీనంగర్‌ ప్రజలు ఆలోచించాలి అని కేసీఆర్‌ సూచించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, ప్రజల హక్కులు కాపాడటం కోసం. కాంగ్రెసోళ్లు 50 ఏండ్లు పరిపాలించారు. వాళ్ల కాలంలో ఏం జరిగిందో మన కండ్ల ముందరనే ఉంది. మంచి, సాగు నీళ్లు లేవు. కరెంట్‌ లేదు. రైతులు, చేనేతల ఆత్మహత్యలు, వలస పోవుడు వంటివి ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు, మూడు నెలలు మేధోమదనం చేసి ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు పోతున్నాం. అదే కాంగ్రెస్‌ పార్టీ ఈ రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపారు. ప్రజలను పిట్టల్లా కాల్చి చంపారు. లక్షల మందిని జైల్లో పెట్టారు. మళ్లీ పొత్తు పెట్టుకుని 15 ఏండ్లు ఏడిపించారు. ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేశారు. మనం మొండిగా ఉన్నాం కాబట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఎవడన్నా డీలాగా ఉంటే.. అయింతా గోల్‌ మాల్‌ చేసే పరిస్థితి ఉండే. ఇటువంటి పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు రూ. 200 పెన్షన్‌ ఇచ్చారు. మనం రూ. 2 వేల పెన్షన్‌ ఇస్తున్నాం. సంపద పెరగడంతో పెన్షన్లు పెంచుకుంటూ పోతున్నాం. భారతదేశ చరిత్రలోనే మానవ దృక్పథంతో గుర్తించి పెన్షన్‌ వేల రూపాయాలు చేసింది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఇక్కడొచ్చి డైలాగులు కొడుతున్నారు. ఇవాళ కూడా అనేక రాష్ట్రాల్లో 600, 700 పెన్షన్‌ ఇస్తున్నారు. కంటి వెలుగు ద్వారా 80 లక్షల మందికి ఉచితంగా కండ్లద్దాలు పంపిణీ చేశాం. కేసీఆర్‌ కిట్‌, అమ్మ ఒడి వాహనాల ద్వారా గర్భిణిలకు సేవలందిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపరిచి, వైద్య వసతులు బాగా పెంచి, నమ్మకం కలిగించాం. దీంతో మాతా శిశు మరణాలు తగ్గాయి. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇటువంటి మానవీయకోణంలో ఉండే పథకాలు తీసుకున్నాం. కళ్యాణలక్ష్మి ద్వారా పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందిస్తున్నాం అని కేసీఆర్‌ తెలిపారు.
చొప్పదండిలో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో
కరీంనగర్‌, చొప్పదండిలో జరిగిన ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. చొప్పదండిలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని రూ.1000 కోట్లు ఖర్చు చేసైనా సరే అద్భుతంగా తీర్చిదిద్దుతానని హావిూ ఇచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో చొప్పదండి నియోజకవర్గంలో సాగునీటికి ఎన్ని తిప్పలు ఉండెనో గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఆ బాధలు తీరినయని చెప్పారు. ‘బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ. కాంగ్రెస్‌ హయాంలో సాగు నీటికి కటకట ఉండె. రైతులు బోర్లు వేసి నీళ్లు పడక ఆత్మహత్యలు చేసుకునేటోళ్లు. ఇదే నియోజకవర్గంలో రామంచంద్రాపూర్‌ సర్పంచ్‌ తిరుపతి బోర్లు వేసివేసి నీళ్లు పడక చివరికి ఆ బోర్ల కాడనే ప్రాణం ఇడిసిండు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా పంటలు పండుతున్నయ్‌’ అని సీఎం తెలిపారు. ‘విూరు గతం గురించి ఒకసారి ఆలోచన చేయాలె. అప్పుడు గూడా వరద కాలువ ఉండె, ఇట్లనే కాకతీయ కాలువ ఉండె. అయినా చొప్పదండిలో సాగునీళ్లుకు కరువుండె. వరద కాలువతోని ఎన్ని బాధలు ఉండె..? మనం మోటర్‌ పెట్టుకుని నీళ్లు పారిచ్చుకుందాం అంటే దాన్ని కోసి అదే కాలువల ఎత్తేద్దురు. ఇయ్యాల విూ జోలికి ఎవడన్నా వత్తుండా..? ఇప్పుడు ఎన్ని తూములు పెట్టుకున్నం..? వరద కాలువను ఎంత బ్రహ్మాండంగా నదిలాగ చేసుకుని చొప్పదండిలో 1.25 లక్షల ఎకరాలకుపైగా పంటలు పండిరచుకుంటున్నం..? అంతేగాక మిషన్‌ కాకతీయ కింద కూడా అనేక చెరువులను, కుంటలను బాగు చేసుకుని పంటలు సాగుచేసుకుంటున్నం.’ అని చెప్పారు. ‘ఈ నియోజకవర్గం కొండగట్టు అంజన్న కొలువైన నియోజకవర్గం. ఈ మధ్యనే విూ ఎమ్మెల్యే రవిశంకర్‌, వినోద్‌కుమార్‌ ఇంకా చాలా మంది కొండగట్టు అంజన్న ఆలయాన్ని ఒక అద్భుతంగా, దివ్యదామంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ మధ్యే నేను ఆ ఆలయాన్ని సందర్శించాను. వెయ్యి కోట్ల రూపాయల ఖర్చయినా సరే కొండగట్టు అంజన్న ఆలయాన్ని బ్రహ్మాండమైన ఆలయంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఆ కొండగట్టు అంజన్న దీవెన మనందరి విూద ఉండాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని సీఎం అన్నారు.కాంగ్రెస్‌ పార్టీ దోకాబాజ్‌ పార్టీ అని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను 58 ఏండ్లు ఏడిపించిన పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఎన్నో విజయాలకు కరీంనగర్‌ గడ్డ కేంద్ర బిందువుగా ఉన్నదని సీఎం గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రజలకు, వ్యక్తిగతంగా తనకు ఎన్నో విజయాలను అందించిన కరీంనగర్‌ గడ్డకు తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. ‘ఈ సభ జరుగుతున్న ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌కు ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో 2011, మే 17న మొట్టమొదటి సింహగర్జణ సభ ఈ కాలేజీ వేదికగానే జరిగింది. తెలంగాణ రాష్ట్రం తీసుకరాకపోయినా, ఉద్యమాన్ని విరమించినా నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని నాడు జరిగిన సభలో నేను చెప్పిన. ఆ సభకు ఎవరూ ఊహించనంత మంది వచ్చి జయప్రదం చేశారు. గంగుల కమాలకర్‌ చెప్పినట్లు దళితబంధు, రైతుబంధు, రైతు బీమా లాంటి అనేక మంచి కార్యక్రమాలను కరీంనగర్‌ వేదిక నుంచే ప్రారంభించుకున్నాం. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు, వ్యక్తిగతంగా నాకు అనేక విజయాలను అందించిన ఈ కరీంనగర్‌ మట్టి నేను శిరసు వంచి నమస్కరిస్తున్నా’ అని చెప్పారు. ‘కాంగ్రెస్‌ పార్టీ దోకాబాజ్‌ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టి మనలను 58 ఏళ్లు ఏడిపించిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. 1969లో ఉద్యమం చేస్తే 400 మందిని కాల్చిచంపిన పార్టీ. 2004లో మనతో పొత్తుపెట్టుకుని రాష్ట్రంల, కేంద్రంల అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆర్నెళ్లకో, ఏడాదికో తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్‌ నేతలు దోకా చేశారు. 13, 14 ఏండ్లు కొట్లాడితే తెలంగాణ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తర్వాత మళ్లీ వెనుకకు పోయారు. అంతేగాక టీఆర్‌ఎస్‌ పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు. దాంతో కేసీఆర్‌ శవయాత్రనో, తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలని నేను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన. ఆ దీక్ష కూడా ఈ కరీంనగర్‌ గడ్డనే వేదికైంది. నన్ను అలుగునూ చౌరస్తాలో అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెట్టారు. ఇలాంటి అనేక ఉద్యమ ఘట్టాల్లో ప్రథమ స్థానంలో ఉండేది కరీంనగర్‌ మట్టి, కరీంనగర్‌ గడ్డ’ అని సీఎం కరీంనగర్‌ నేలపై తనకున్న అపారమైన ప్రేమను చాటుకున్నారు. ‘ఇక్కడి నుంచే ఉద్యమం మొదలైంది కాబట్టి ఇక్కడ నేను రెండు విషయాలు చెప్పదల్చుకున్నా. ఒక దేశమైనా, రాష్ట్రమైనా బాగుందా.. లేదా..? అని చూసేందుకు రెండు కొలమానాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది తలసరి ఆదాయం. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో మన ర్యాంకు పంతొమ్మిదో, ఇరవైయ్యో ఉండె. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన తర్వాత నా తెలంగాణ 3.18 వేల తలసరి ఆదాయంతోటి దేశంలోనే నెంబర్‌ 1గా ఉన్నది. కడుపు నోరు కట్టుకుని, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నం కాబట్టి ఇయ్యాల ఈ స్థాయికి వచ్చినం. రెండో గీటురాయి తలసరి విద్యుత్‌ వినియోగం. 2014లో తలసరి విద్యుత్‌ వినియోగం 1,122 యూనిట్లు ఉండె. దేశంలో మన ర్యాంకు ఎక్కడో ఉండె. ఇప్పుడు 2,040 యూనిట్ల తలసరి విద్యుత్‌ వినియోగంతోటి దేశంలో మనమే నెంబర్‌ 1గా ఉన్నాం’ అన్నారు.
బీజేపాయిన గెలిస్తే ఏకాణ పనిగాదు..
హుజూరాబాద్‌: బీఆర్‌ఎస్‌ సర్కారు రైతుల కోసం ఎన్నో మంచి పనులు చేసిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. మంచి పనులు చేసే బీఆర్‌ఎస్‌ పార్టీని కాదని వేరే వాళ్లకు ఓటేస్తే విూ ఓటును మోరీల పారేసినట్టే అయితదని ఓటర్లను ఆయన హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌, చొప్పదండి ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించిన అనంతరం సీఎం హుజూరాబాద్‌ సభలో పాల్గొన్నారు. పాడి కౌశిక్‌ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గంలో మంచిగ పనులు జరుగుతయని అన్నారు. గుడ్డిగ ఓటేసి ఆగం కావద్దని కోరారు.‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో మంచి పనులు చేసింది. పెట్టుబడి కోసం రైతుబంధు తెచ్చింది. కర్మగాలి ఎవరైనా చనిపోతే రైతుబీమా ఇస్తుంది. విూరు పండిరచిన పంటను కొనుగోలు చేసి బ్యాంకుల్లో డబ్బులు వేస్తున్నది. ఇవన్నింటిపై విూరు గ్రామాల్లో చర్చపెట్టాలె. గుడ్డిగ ఓటేసుడు గాదు. దయచేసి బాగా ఆలోచించి ఓటేయాలి. ఇప్పుడు బీజేపాయిన గెలిస్తే ఏమైతది..? ఇప్పటికి ఎన్నేండ్లాయె గెలిచి..? ఏకాణ పని అయ్యిందా..? పైంగ పెద్దపెద్ద మాటలు. ఎల్లయ్యకు ఎడ్లు లేవు.. మల్లయ్యకు బండి లేదు. వట్టియే మాటలు. శూన్య ప్రియాలు.. శుష్క హస్తాలు. ఏం జరుగదు. అదే కౌశిక్‌రెడ్డి గెలిస్తే పనులు జరుగుతయ్‌’ అని సీఎం చెప్పారు.‘నేను విూకు ఒక్కటే మాట చెప్తున్నా. తెలంగాణల నేను 50 శాతం పైన తిరిగిన. ఈ ఎన్నికలల్ల వందకు వంద శాతం బీఆర్‌ఎస్‌ పార్టీ గెలువబోతున్నది. మరె గవర్నమెంట్‌ దిక్కు ఉండే కౌశిక్‌ రెడ్డి గెలిస్తే మంచిదా..? వేరేటోళ్లు గెలిస్తే మంచిదా..? విూరే ఆలోచన చేయాలె. విూ ఓటు వేరే ఎవరికి వేసినా మోరీల పారేసినట్టే. మురిగిపోతది. కేసీఆర్‌ హుజూరాబాద్‌కు ఏం తక్కువ జేసిండు..? విూ కాలువలు లైనింగ్‌ చేయించలేదా..? మునుపటి వారాబందీలు బందయ్యి ఇప్పుడు కాలువల నిండ నీళ్లు వస్తలేవా..? విూ దగ్గర ధాన్యం కొంటలేరా..? విూకు రైతుబంధు వస్తలేదా..? విూ దగ్గర దళిత బంధు అన్ని ఇండ్లకు రాలేదా..? మరి ఇన్ని జేసిన కేసీఆర్‌ను గాదని, ఎవడ్నో ఎత్తుకుంటే ఏమొస్తది..? హుజూరాబాద్‌ నియోజకవర్గం ఇవన్నీ ఆలోచన చేయాలె. మిత్రుడు కౌశిక్‌రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వండి’ సీఎం కోరారు.
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉత్తమమైన మనిషి..
పరకాల : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉత్తమమైన మనిషి.. ప్రజల ఫీలింగ్‌ ఉన్న మనిషి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశంసించారు. పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాదలో కేసీఆర్‌ పాల్గొని చల్లా ధర్మారెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.ధర్మారెడ్డి ఉత్తమమైన మనిషి, ప్రజల ఫీలింగ్‌ ఉన్న మనిషి. ఆయన ఎవరి తెరుగు పోయేటోడు కాదు. నియోజకవర్గం పనే అడిగే వ్యక్తి. వ్యక్తిగత పనులు అడగలేదు. చలివాగు ప్రాజెక్టు కావొచ్చు, కాలువలు కావొచ్చు. దేవాదుల నీళ్ల విషయం కావొచ్చు. ఎస్సారెస్సీ నీళ్ల విషయం కావొచ్చు. ఇవే నాతో మాట్లాడిరడు తప్ప వ్యక్తిగత పనులు అడగలేదు. ఇలాంటి మంచి అభ్యర్థిని గెలిపిస్తే రైతుబంధు 16 వేలు అయితది.. 24 గంటల కరెంట్‌ ఉంటది.. అన్ని విధాలా పరకాల అభివృద్ధి జరుగుతది. పరాకల అభివృద్ధి విషయంలో ఏం కావాలంటే అది చేసి పెట్టే బాధ్యత నాది. వేరోడు వస్తే మళ్లీ ఆగమాగం అవుతది. పాలిచ్చే బర్రెను అమ్ముకొని దున్నపోతును తెచ్చుకున్నట్లు అవుతది. లేనిది మెడకు తుండ కట్టుకున్నట్టు అవుతది. ఏది సమంజసం..? ఏది న్యాయం..? ఏ వైపు పోతే మంచిదని ఆలోచించాలి. విూ భవిష్యత్‌ విూ చేతుల్లో ఉంటది కాబట్టి నిర్ణయం చేస్తే మంచిది అని కేసీఆర్‌ సూచించారు.గతంలో తండాలను పంచాయతీలు చేసిండ్రా..? ఎన్నేండ్లు కొట్లాడినా చేయలేదు. చివరకు బీఆర్‌ఎస్‌ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది. విూరు మంచి వస్త్ర పరిశ్రమ తీసుకొచ్చారు.. కాకతీయ మెగా టెక్స్‌ టైల్స్‌ పార్కు ఇక్కడకు రావడం చాలా సంతోషం. చాలా మంది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ధర్మారెడ్డి చెబుతుండ్రు. నిజంగా చాలా లాభం జరుగుతది. పరకాలకు ఏదో కోర్టు అడిషనల్‌గా అవసరం ఉంది. విూరు అనుకుంటే అయ్యే పని అంటున్నడు. అదే అయ్యే పని అయితే పరకాలలో పెట్టిస్తా తప్పకుండా. న్యాయవాద మిత్రులకు మనవి చేస్తున్నా. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో మాట్లాడి కోర్టు తెప్పించే ప్రయత్నం చేస్తాను అని కేసీఆర్‌ హావిూ ఇచ్చారు.
ధరణిని తీసేసి భూ భారతి తెస్తరట..
చొప్పదండి: కాంగ్రెస్‌ పార్టీ ఇయ్యాల మ్యానిఫెస్టో విడుదల చేసిందని, దానిలో ఇప్పుడున్న ధరణిని తీసేసి దాని స్థానంలో భూ భారతిని తీసుకొస్తమని ప్రటించిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. భూ భారతి కొత్తదేం కాదని, గతంలో తీసుకొచ్చారని, అయినా దానితోటి ఏం గాలేదని సీఎం చెప్పారు. భూ భారతి తెచ్చినా గదే పైరవీకారులు, గదే దళారీలు ఉండేదని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.‘ఇయ్యాల కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించిందట. ధరణిని తీసేసి దాని స్థానంలో కొత్త పోర్టల్‌ తెస్తరట. దానికి ‘భూ భారతి’ అని పేరు పెడుతరట. ఈ భూ భారతి కొత్తదేం గాదు. గతంలోనే 30, 40 ఏండ్ల కింద తెచ్చిండ్రు. దాంతోటి ఏంగాలే. మళ్ల పాత కథనే ఉండె. గదే పైరవీకారులు, గదే దళారీలు, అదే పాత కథ ఉండె. కాబట్టి విూరు బాగా ఆలోచించాలి. బీఆర్‌ఎస్‌ పార్టీ 24 గంటల కరెంటు ఇస్తున్నది. కాంగ్రెస్‌ పార్టీ మూడు గంటలు చాలు అంటున్నది. మరె 24 గంటలోడు కావాల్నో.. మూడు గంటలోడు కావాల్నో విూరే తేల్చాలి. మేం రైతుబంధు ఇస్తున్నం. కాంగ్రెసోళ్లు రైతుబంధు వేస్ట్‌ అంటున్నరు. మరె రైతుబంధు ఇచ్చెటోళ్లు కావాల్నో.. రైతుబంధు వేస్ట్‌ అనేటోళ్లు కావాల్నో విూరే నిర్ణయించుకోవాలె’ అని సీఎం సూచించారు.‘బీఆర్‌ఎస్‌ పార్టీ భూముల క్రయవిక్రయాల్లో అక్రమాలకు తావు లేకుండా ధరణి పోర్టల్‌ తెచ్చింది. వాళ్లు ధరణిని బంగాళాఖాతంలో వేస్తమంటున్నరు. మరె ధరణి పోర్టల్‌ను ఉంచుకుంటరో.. బంగాళాఖాతంల వేసుకుంటరో విూ ఇష్టం. రైతులకు మేలు జేస్తోడు కవాల్నో.. కిందవిూద జేసేటోడు కావాల్నో విూరే తేల్చుకోండి. విూరు ఆలోచించకుంట ఓటేస్తే ఆగమైతరు. అప్పుడు నేను గూడా ఏం జేయలేను. పదేళ్లుగా మేం పడ్డ కష్టం బూడిదల పోసిన పన్నీరయితది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి, ఎవరిని గెలిపిస్తే రాష్ట్రం బాగుపడుతదో చూసి ఓటేయండి. ఇంక గోపాల్‌రావు పేట, ఘర్షకుర్తిలను మండలాలు చేయాలని విూ ఎమ్మెల్యే రవిశంకర్‌ కోరిండు. అదేం పెద్దపని కాదు. నిమిషాల విూద జీవో ఇష్యూ చేసి ఆ రెండు మండలాలు ఏర్పాటు చేస్తం. విూరు ముందుగా రవిశంకర్‌ను గెలిపియ్యండి. మండలాల ఏర్పాటుతోపాటు రవిశంకర్‌ కోరిన ఇంకా కొన్ని పనుల సంగతి నేను చూసుకుంట’ అని సీఎం హావిూ ఇచ్చారు.

భారాస భారం మొత్తం ప్రజలమీదే..
` అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని ఎవరు పడితే వారి చేతుల్లో పెడదామా?
` డిసెంబరు 3 తర్వాత సీఎం కేసీఆర్‌ శుభవార్త చెబుతారు: మంత్రి కేటీఆర్‌
ఖానాపూర్‌(జనంసాక్షి): మంచిగా నడిచే ప్రభుత్వాన్ని.. ప్రగతిలో దూసుకెళ్తోన్న రాష్ట్రాన్ని ఎవరు పడితే వారి చేతుల్లో పెడదామా?ప్రజలు ఆలోచించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఒకవైపు కాంగ్రెస్‌.. మరోవైపు భాజపా నేతలు దిల్లీ నుంచి రాష్ట్రానికి వస్తున్నారని.. వారందరి అజెండా ఒక్కటేనన్నారు. ఎలాగైనా కేసీఆర్‌ గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎంత మంది వచ్చినా సరే.. భారాస మాత్రం రాష్ట్ర ప్రజల విూదే భారం వేసి ముందుకెళ్తోందన్నారు. మంచిర్యాల జిల్లా ఖానాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన కేటీఆర్‌.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.‘‘రాష్ట్రంలో 46 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు వస్తున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో కేవలం 29 లక్షల మందికి మాత్రమే పింఛన్లు వచ్చేవి. బీడీలు చేసే అక్కా చెల్లెళ్లను గతంలో ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. కేసీఆర్‌ సీఎం అయ్యాకనే కదా.. రూ.2వేలు పింఛన్‌ ఇస్తున్నారు. తెలంగాణ సాధించుకున్నాం కాబట్టే.. మన డబ్బులు మనం తీసుకుంటున్నాం. రైతు బీమా, రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌.. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నాం. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు మేనమామలా.. కేసీఆర్‌ అండగా ఉన్నారు. కాంగ్రెస్‌ హయాంలో సర్కారు దవాఖానాకు వెళ్లను బాబోయ్‌ అని అనేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వెళ్తే.. ప్రభుత్వ ఆస్పత్రికే వెళ్తామని ప్రజలు అంటున్నారు. తాగు నీరు, సాగు నీరు, కరెంటు, సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో ముందుకెళ్తున్నాం. నీరు, కరెంటుతో పాటు అనేక సమస్యలు పరిష్కరించిన భారాస.. మాకేం చేస్తుందని తెలంగాణ ఆడబిడ్డలు అడుగుతున్నారు. అత్తలకు పింఛన్లు వస్తున్నాయి.. మరి మా సంగతి ఏంటని కోడళ్లు ప్రశ్నిస్తున్నారు. అందుకే డిసెంబర్‌ 3 తర్వాత కోడళ్లకు కేసీఆర్‌ శుభవార్త చెబుతారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరి కోసం కొత్త పథకాన్ని అమలు చేస్తాం. దాని పేరు ‘సౌభాగ్య లక్ష్మి’. నెలకు రూ.3వేలు విూ ఖాతాల్లో వేస్తాం. ఖానాపూర్‌లో విూరు వేసే ఓటు జాన్సన్‌కు కాదు.. కేసీఆర్‌కు వేస్తున్నట్లే భావించాలి’’ అని కేటీఆర్‌ కోరారు.