మళ్లీ చిత్తవుతున్న పత్తిరైతు
ధరలు తగ్గించి కొనుగోళ్లు చేస్తున్న వ్యాపారులు
చోద్యం చూస్తున్న అధికారులు
ఆదిలాబాద్/వరంగల్,అక్టోబర్23(జనంసాక్షి): పత్తిరైతులు మరోమారు చిత్తయ్యారు. ఏటా సీజనప్‌లో ధరలు దక్కక అమ్ముకున్నాక, ధరలు పెరగడంతో చిత్తవుతున్నారు. వరంగల్,ఆదిలాబాద్, ఖమ్మం మార్కెట్లకు పత్తి బాగా తరలివస్తోంది. దీనిని ఆసరగా చేసుకుని వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. సిసిఐ రంగంలో ఉన్నా ప్రయోజనం కానరావడం లేదు. అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా, దళారులు, వ్యాపారులదే పైచేయి అవుతోంది. ఈ ఏడాది పత్తి ధర విషయంలో రైతుల ఆశలపై వ్యాపారులు నీళ్లు చల్లుతున్నారు. తెల్లబంగారానికి మద్దతు ధర తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నా పట్టించుకునే వారు లేరు. నేతలంతా ప్రచారంలో ఉండడంతో రైతులకు అండగా నిలిచేవారు లేరు. మొదటి రోజు ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.5800 ధర చెల్లించి కొనుగోలు చేయగా.. సోమవారం రూ.150 తగ్గించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బేల్ ధర తగ్గడమే దీనికి కారణమని చెబుతున్నారు. దసరా, శని, ఆదివారాలు సెలవులు రావడంతో నాలుగు రోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేశారు. తిరిగి సోమవారం కొనుగోళ్లు ప్రారంభం కాగా.. రైతులు పత్తిని విక్రయించడానికి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. మద్దతు ధర రూ.150 తగ్గడం, తేమ శాతం 30వరకు ఉండగా.. 27కు కుదించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బేల్ ధర తగ్గడంతో పత్తికి మద్దతు ధర తగ్గిందని వారు రైతులకు తెలిపారు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రోజు వారీగా ధరలో హెచ్చు తగ్గులుంటాయని, ఆ ధర ప్రకారమే ప్రైవేట్ వ్యాపారులు పత్తిని కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సోమవారం ప్రైవేట్ వ్యాపారులు బీట్‌లో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మద్దతు ధర తగ్గడంతో క్వింటాకు రూ.5650
చెల్లించి కొనుగోలు చేశారు. దాదాపు 10 వేల పత్తి వాహనాలు వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. తేమ శాతం 30 వరకు ఉండగా.. 27కు కుదించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. తేమ పేరుతో రైతులను వ్యాపారులు ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకరావాలని పేర్కొన్నారు. నిబంధనల మేరకు వ్యాపారులు పత్తిని కొనుగోలు చేయాలని, ఏమైనా ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ సారి కేంద్రం పత్తిని క్వింటాకు రూ. పత్తి క్వింటాకు రూ.5450 ప్ర భుత్వం నిర్ణయించగా గతేడాది కంటే రూ.1130 అధికంగా ఉంది. ఈ సీజన్‌లో 24 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు సీసీఐ ద్వారా కొనుగోళ్లు జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. పంట కొనుగోళ్ల విషయంలో అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా పటిష్టమైన ప్రణాళికలు రూపొందించినా పరిస్థితి యధావిధిగానే ఉంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా పంటలో సైతం తేమ శాతం తక్కువగా ఉంటుంది. అయినా పత్తిలో తేమ సాకుతో పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నారని రైతులు అంటున్నారు.