మహబూబాబాద్ జిల్లా బంద్ ప్రశాంతం
భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
మహబూబాబాద్,నవంబర్14 (జనంసాక్షి) : డ్రైవర్ నరేశ్ మృతికి నిరసనగా.. మహబూబాబాద్ జిల్లా బంద్‌కు జెఎసి పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడ తనిఖీలు చేపట్టారు. కార్మికుల ఆందోళనల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరక్కుండా జిల్లా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టసీ కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో గురువారం పలుప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మె 41వరోజు డిపోల నుంచి బస్సులు బయటకురాకుండా కార్మికులు అడ్డుకున్నారు. వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. అక్కడక్కడ పోలీసులకు,కార్మికులకు మధ్య తోపులాటలు జరిగాయి. దీంతో గురువారం జిల్లా వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజామునుంచే కార్మికులు, అఖిలపక్ష కార్యకర్తలు డిపోల ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందగా బంద్ పాటించాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.