మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ

3

-నగరం నుంచి జిల్లాలకు విస్తరిస్తున్న మహమ్మారి

-అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక.

హైదరాబాద్‌,జనవరి28: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కే పరిమితమైన స్వైన్‌ఫ్లూ జిల్లాలకు విస్తరిస్తోంది. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇద్దరికి వ్యాధి నిర్ధారణ అయింది. నానాటికి ఈ వ్యాధి విజృంభిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. జిల్లాలో బుధవారం తాజాగా మరో ఇద్దరికి స్వైన్‌ఫ్లొ ఉన్నట్లు నిర్థరణ అయ్యింది. స్వైన్‌ఫ్లొ సోకిన ఇద్దరిలో ఒక వైద్యురాలు ఉన్నారు. స్వైన్‌ఫ్లొ సోకిన వైద్యురాలికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక రాజధానిలో స్వైన్‌ భయంతో దీంతో ఎక్కడ చూసినా మూతికి ముసుగేసి తిరగుతున్నారు. ఎక్కడ చూసినా ముఖానికి మాస్క్‌లు కట్టుకుని కనిపిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1500 మందికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించగా.. 450 మందికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణయ్యింది. స్వైన్‌ఫ్లూ కారణంగా గాంధీ ఆస్పత్రిలో మంగళవారం ఒక్క రోజే ముగ్గురు మృత్యువాత పడ్డారు. స్వైన్‌ఫ్లూతో 24గంటల్లో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రతీ రోజు పది మందికి పైగా స్వైన్‌ ప్లూ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరుతున్నారు. మొత్తం 106 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 46 మందికి స్వైన్‌ ఫ్లూ సోకినట్లు నిర్దారించారు. మొత్తం 414 మంది స్వైన్‌ ఫ్లూ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడంతో ఆందోళన తీవ్రమవుతోంది.మరి కొంత మంది రోగులకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వైద్యులు వారికి సంబంధించిన శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించారు. ఈ వ్యాధి భారిన పడిన రోగులతో నగరంలోని ఆస్పత్రులన్నీ కిక్కిరిసి పోతున్నాయి. ఆస్పత్రులకు వచ్చే రోగులకు వసతులు కల్పించలేక సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఒక్కగాంధీ ఆసుపత్రిలోనే దాదాపు 71 మంది స్వైన్‌ ఫ్లూతో చికిత్స పొందుతున్నారు. ఇవి కాకుండా నగరంలోని ఉస్మానియా, ఫీవర్‌ ఆసుపత్రులకు స్వైన్‌ ప్లూ అనుమానితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆయా ఆసుపత్రుల్లో అదనపు బెడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబందనల ప్రకారం వైరస్‌ వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని నిమ్స్‌ డైరెక్టర్‌ నరేంద్రనాధ్‌ తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్టాల్ర నుండి స్వైన్‌ ప్లూ అనుమానిత శాపింల్స్‌ ఐపిఎంకు వస్తున్నాయని, దీనిపై ఆయా రాష్టాల్ర వైద్య శాఖలను అప్రమత్తం చేశామని తెలిపారు. ఇదిలావుంటే స్వైన్‌ ప్లూ రోగుల పట్ల ప్రైవేటు ఆసుపత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. . వ్యాధి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చిన వారి నుండి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్లున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకువెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. లకిడీకాపూల్‌ లోని లోటస్‌ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులకు రెండు రోజులు చికిత్స అందించి స్వైన్‌ ఫ్లూ నిర్ధారణ కాగానే చేతులెత్తేయడంతో తల్లిదండ్రులు వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వైన్‌ ఫ్లూ నివారణకు అన్ని వైద్య కేంద్రాల్లో 24గంటలు వైద్యం అందించేందుకు డాక్టర్లను ప్రభుత్వం నియమించింది. 17వేల 300 సిరప్‌లను సిద్ధంగా ఉంచింది. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం నివారణకు మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే స్వైన్‌ ఫ్లూకు మందుల కొరత ఏ ఆసుపత్రిలోనూ లేదని నిమ్స్‌ డైరెక్టర్‌ నరేంద్రనాథ్‌ చెప్పారు.  అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రులకు మందులను పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. గాంధీలో స్వైన్‌ ఫ్లూతో ఇద్దరు మృతి చెందడంతో.. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది మృతి చెందారని నరేంద్రనాథ్‌ చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధిని నివారించవచ్చునని చెప్పారు.