మహాకూటమికి ఓటేస్తే..  మరణశాసనం రాసుకున్నట్లే


– ప్రాజెక్టులను అడ్డుకున్న బాబుతో కాంగ్రెస్‌ పొత్తుసిగ్గుచేటు
– అమరుల ఆకాంక్షల మేరకు పొత్తులని కోదండరాం అంటున్నాడు
– ఏ అమరులు కోరుతున్నారో వెల్లడించాలి
– తెలంగాణ కాంగ్రెస్‌ ఇవ్వలేదు.. మనం గర్జిస్తే వచ్చింది
– కేటీఆర్‌కు తెలివిలేదని ఉత్తమ్‌ అంటున్నాడు
– నిజమే.. నాకు కారు ఇంజన్‌లో డబ్బులు తీసుకెళ్లేంత తెలివి లేదు
– కేవలం ప్రజలకు తాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలు అందించటమే తెలుసు
– కేసీఆర్‌ అంటే.. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు
– డిసెంబర్‌7న కూటమికి ఓటుతో బుద్దిచెప్పండి
– తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడం కేసీఆర్‌తోనే సాధ్యం
– ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయండి
– కామారెడ్డి జిల్లా సభలో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌
కామారెడ్డి, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : మహాకూటమికి ఓటు వేస్తే మన మరణశాసనం మనమే రాసుకున్నట్లు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ సభలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ కోసం అప్పుడైనా.. ఇప్పుడైనా.. ఎప్పటికైనా నిలబడేది ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబుతో కాంగ్రెస్‌ జత కట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు జట్టుకట్టి.. అనైతిక పొత్తులు పెట్టుకుంటున్నాయన్నారు. అమరుల ఆకాంక్షల మేరకు పొత్తులు అని కోదండరామ్‌ అంటున్నారని, పొత్తులు పెట్టుకోమని కోదండరామ్‌ను ఏ అమరులు కోరుతున్నారో వెల్లడించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు చేతిలో జుట్టుపెట్టి.. తెలంగాణకు ఏం చేయగలుగుతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఆలోచించి ఓటేయాలని, ఆషామాషీగా ఓటు వేయొద్దని ప్రజలకు కేటీఆర్‌ సూచించారు. కేసీఆర్‌ పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడు అని తెలిపారు. కేసీఆర్‌ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని అనుకుంటున్నారని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ నాయకులు ఏనాడూ ఆత్మగౌరవంతో పని చేయలేదని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఆంధ్రా నాయకుల వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పదవుల కోసం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పెదవులు మూసుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌ నాయకుల నిర్వాకం వల్లే తెలంగాణ నష్టపోయిందన్నారు. సిగ్గులేకుండా పదవులు పట్టుకొని వేలాడారని విమర్శించారు. తెలంగాణ రైతాంగం నోట్లో మళ్లీ మట్టి కొట్టేందుకు మహాకూటమి రూపంలో వస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రైతుల కష్టాలు తీరాతాయన్నారు. ఎల్లారెడ్డిలో పెద్దగా పరిశ్రమలు లేవని, వ్యవసాయాధారిత ప్రాంతమన్నారు.  సస్యశ్యామలం చేసుకునే ప్రాంతం ఇదని, సమైక్యాంధప్రదేశ్‌లో ఈ నియోజకవర్గానికి నీళ్లు రాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లక్షా20 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నామని కేటీఆర్‌ తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని విమర్శించారు.
ఈ ప్రాంతాన్ని మరో కోనసీమగా తయారు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విూద 200 కేసులు వేసింది కాంగ్రెస్‌ పార్టీ నేతలని, ఇంటింటికీ తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తే తమ కిందికి నీళ్లు వస్తాయని భావించి.. కాంగ్రెస్‌ నేతలు కోర్టుల్లో కేసులు వేశారని కేటీఆర్‌ అన్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్నట్లుగా ఎల్లారెడ్డి పరిస్థితి ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో నీటి విషయంలో అన్నిపార్టీలు ఒకేతాటిపైకి వస్తే.. ఇక్కడేమో ఆ పరిస్థితి లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ. 17వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. డిసెంబర్‌ 11న కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష వరకు రుణమాఫీ చేయబోతున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో కరెంట్‌ కోతలు అందరికీ తెలుసని, 2009లో తొమ్మిది గంటల కరెంట్‌ ఇస్తామని చెప్పారని కానీ, ఆరు గంటల కరెంట్‌ ఇచ్చారన్నారు. ఇదికూడా ఒకేసారి ఇవ్వలేదని,  కరెంట్‌ కోసం ఆనాడు నానాతిప్పలు పడ్డారన్నారు. ర్నాలు చేసే పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామన్నారు. రైతుబంధు పథకం అమలు చేశామని, రైతుబీమాతో వారి కుటుంబాల్లో భరోసా నింపామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కేటీఆర్‌ తెలివిలేని వాడని ఉత్తమ్‌ అంటున్నారని.. అది నిజమేనని కేటీఆర్‌ అన్నారు. కారు ఇంజిన్‌లో డబ్బుదాచుకునే తెలివి, నోట్ల కట్టలతో ఎమ్మెల్యేలను కొనే తెలివి తేటలు వారికే ఉన్నాయని నాకు లేవని ఎద్దేవా చేశారు. నాకు, తెరాస నేతలకు ఉన్నది ఒక్కటే తెలివని అది తెలంగాణ ప్రజలకు నీరందించాలని, ప్రాజెక్టులు పూర్తిచేయాలి, సంక్షేమ పథకాలు వారికి అందించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే తెలివిమాత్రమే ఉందన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అంటూ కాంగ్రెస్‌ నేతలు ఎగురుతున్నారని.. తెలంగాణను కాంగ్రెస్‌ ఇవ్వలేదని, ప్రజలే గుంజుకున్నారని కేటీఆర్‌ అన్నారు.  కాంగ్రెస్‌కు బాసులు ఢిల్లీలో ఉన్నారని,  తమకు తెలంగాణ గల్లీల్లో ఉన్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు.
రాబోయే కాలంలో తెలంగాణలో మరింత అభివృద్ధి చెందాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని, మరోసారి తెరాస ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కేటీఆర్‌ ప్రజలను కోరారు.