మహాకూటమికి ఓట్లేస్తే.. మళ్లీ చీకటిరోజులొస్తాయి

– నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేశాం
– గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి పనులు చేపట్టాం
– దేశాన్ని తెలంగాణను ఆదర్శంగా నిలపడమే కేసీఆర్‌ ధ్యేయం
– మరోసారి అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
– ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్‌25(జ‌నంసాక్షి) : మహాకూటమి ఒక అనైతిక కలయిక అని, కూటమి అభ్యర్థులకు ఓట్లేస్తే మళ్లీ తెలంగాణలో చీకటి రోజులను ఆహ్వానించినట్లే అవుతుందని, దీనిని ప్రజలు గుర్తించి అప్రమత్తంగా ఉండాలని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రచారానికి కేటీఆర్‌ గురువారం శ్రీకారం చుట్టారు. సరంపల్లి, అంకిరెడ్డిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేటీఆర్‌.. పలు ప్రాంతాల్లో జరిగిన సభల్లో మాట్లాడారు.. కాంగ్రెస్‌ది భస్మాసుర హస్తం అని,  కాంగ్రెస్‌ ఎవరి నెత్తిన చేయి పెడితే ఆ పార్టీలు భస్మమే అన్నారు. టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ నెత్తిన కాంగ్రెస్‌ చేయి పెట్టిందని, ఆ మూడు పార్టీలతో పాటు కాంగ్రెస్‌ కూడా భస్మమేనని కేటీఆర్‌ అన్నారు.  సరంపల్లిలో నాలుగేళ్లలో రూ. 11 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. పేదల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులకు పెట్టుబడి ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు అందిస్తున్నట్లు.. పెన్షన్‌ విషయంలో కూడా వయస్సును 57 ఏళ్లకు సవరిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తమన్నామన్నారు. బడ్జెట్‌లో మైనార్టీల కోసం రూ. 2 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అన్ని పార్టీలు కూటమిగా వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్‌ సూచించారు. మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణకు కన్నీళ్లే మిగులుతాయని, కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామన్నారు. అభివృద్ధి పనులకు కాంగ్రెస్‌, టీడీపీ అడ్డుపడుతున్నాయని, మహాకూటమికి ఓటు వేస్తే మళ్లీ కరెంట్‌ కోతలు ఉంటాయని అన్నారు. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే పేదలు బాగుంటరని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకొనేందుకే నాలుగేళ్లుగా కేసీఆర్‌ ప్రత్యేక పథకాలను అమల్లోకి తెచ్చారన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్‌తో పాటు అన్ని కుల సంఘాల, కులవృత్తులకు పెద్దపీట వేశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగేళ్లలో పాత ప్రాజెక్టులను పూర్తిచేస్తూనే , కొత్త ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తున్నామని, కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గతంలో కరెంట్‌ కోతలతో రైతులు పొలాల వద్దనే పడిగాపులు కాసేవారని, కానీ తెరాస హయాంలో అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 24గంటల విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానిదేనన్నారు. ఇలాంటిప్రభుత్వాన్ని, పేదల మనిషిగా పేరుపొందిన కేసీఆర్‌ను మరోసారి సీఎంపీటం ఎక్కించేందుకు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలవాలని కేటీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.