మహాకూటమి గెలిస్తే..  పాలమూరుకు మళ్లీ గండమే


– పాలమూరు పథకాన్ని ఆపాలని బాబు కేద్రానికి లేఖలు రాశారు
– బాబుచేతుల్లోకి అధికారం వెళితే ప్రాజెక్టులను ఆపేస్తారు
– జిల్లా ప్రజలు ఆలోచించి ఓటేయాలి
– అభివృద్ధిని కాంక్షించే కేసీఆర్‌తోనే రాష్ట్రం సస్యశ్యామలం
– నాలుగేళ్లలో పాలమూరుకు పెద్దపీట వేశాం
– మరోసారి ఆశీర్వదిస్తే.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
– మక్తల్‌ ప్రజానివేదన సభలో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌
మహబూబ్‌నగర్‌, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ – టీడీపీ పొత్తు పెట్టుకున్న మహాకూటమి గెలిస్తే పాలమూరుకు మళ్లీ కొత్త గండం తప్పదని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం కేటీఆర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మక్తల్‌లో బైక్‌ ర్యాలీలో పాల్గొన్న కేటీర్‌ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా దీవెన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాజకీయ ఉనికి కోసమే ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపండంటూ.. చంద్రబాబు కేంద్రానికి 30 ఉత్తరాలు రాశాడని తెలిపారు. ఉత్తమ్‌, బాబు, కొందరు మిత్రులు పొత్తు పెట్టుకున్నారని, ఈ పొత్తు వల్ల పాలమూరుకు కొత్త గండంగా మళ్లీ వస్తున్నారన్నారు. అధికార పగ్గాలు చంద్రబాబు చేతుల్లో ఉంటే.. పాలమూరు ఎత్తిపోతలను ఆపి రైతుల నోట్లో మట్టి కొడుతారని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలని సూచించారు. పొరపాటున టీడీపీ అభ్యర్థి గెలిస్తే ఇక్కడ మళ్లీ నీటి కష్టాలు వస్తాయన్నారు. టీడీపీ అభ్యర్థులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని కేటీఆర్‌ ప్రశ్నించారు.  ఒక వేళ మహాకూటమి గెలిస్తే.. రాహుల్‌, చంద్రబాబు దగ్గరకు పోవాల్సి వస్తుందని, ఈ గట్టునా ఉంటారా?.. ఆ గట్టునా ఉంటారా? అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలని కేటీఆర్‌ సూచించారు.
టీడీపీ కొత్తకోట దయాకర్‌రెడ్డికి టికెట్‌ ఇస్తున్నారని తెలిసిందని, మక్తల్‌ ప్రజలు చాలా తెలివైనవారన్నారు. కాబట్టి చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి ఓటేయాలని కేటీఆర్‌ కోరారు. రాష్ట్రంలో గెలిచేది టీఆర్‌ఎస్‌.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్‌ అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని చిన్న పిల్లాడిని అడిగినా స్పష్టంగా చెబుతాడు అని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో పాలమూరు జిల్లా బాగా నష్టపోయిందన్నారు. అప్పర్‌ కృష్ణా పూర్తయి ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చగా ఉండేదని
తెలిపారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ ప్రాజెక్టుల కింద 8లక్షల నుంచి 9లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామన్నారు. పాలమూరు పచ్చబడుతుందంటే, వలస పోయిన వారు తిరిగి వస్తున్నారంటే అది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘనత అని తెలిపారు. పాలమూరు పార్లమెంట్‌ సభ్యుడిగానే కేసీఆర్‌ తెలంగాణను సాధించారని, పాలమూరు జిల్లాకు శాశ్వతంగా రుణపడి ఉంటామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. మక్తల్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసమే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారని కేటీఆర్‌ తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయోజనాల కోసం దేవుడితోనైనా కొట్లాడుతామని కేటీఆర్‌ చెప్పారు. పాలమూరు మట్టిబిడ్డల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో రూ. 36 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారన్నారు. ఈజిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేతలు హర్షవర్ధన్‌రెడ్డి, డి.కె. అరుణ శిశ్యుడు పవన్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ కలిసి పాలమూరు ఎత్తిపోతలపై కేసులు వేశారని తెలిపారు. పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్‌ నేతలు చూడలేక కేసులు వేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. టీడీపీ నేతల కండ్లు మండుతున్నాయని, కాంగ్రెస్‌ నాయకులు ప్రగతి నిరోధకులుగా మారారని విమర్శించారు. ఈ ప్రజా నివేదిన సభలో ఆపద్ధర్మ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌ రెడ్డి, తెరాస అభ్యర్ధులు ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, చిట్టెం రాంమోహన్‌, నేతలు చిట్టెం సుచరితారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.