మహాకూటమి నాయకులు…
– మహిళలను అవమానించడం తగునా
– మద్యం మత్తులో సోదాలు చేస్తారా?
– ఎన్నికల అధికారులు ఏంచేస్తున్నట్టు
– కార్పోరేషన్ మేయర్ జాలీ రాజమణి
గోదావరిఖని, నవంబర్ 25, (జనంసాక్షి) :
మహాకూటమి అని పేరుపెట్టుకుని మహిళలను అవమానించడం పట్ల రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ జాలీ రాజమణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం రామగుండంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహాకూటమిలో భాగమైన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ దారుణాలు చేస్తున్నారని విమర్శించారు. మహిళాలోకాన్ని అవమానించారని దుయ్యబట్టారు. రౌడీయిజం, రాజకీయాలు వేరని తెలిపారు. రూ.కోట్లు గుమ్మరించి ఓట్లు కొనడానికి వ్యూహాలు పన్నుతున్నారని ఇదేంపద్దతని ప్రశ్నించారు. రామగుండం ప్రాంతంలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మహిళా సమావేశం ఏర్పాటు చేస్తే అందులో పాల్గొన్న మహిళలను వేధించారని తెలిపారు. అంతేకాక సమావేశంలో పాల్గొన్న మహిళలను వెంబడించిన కాంగ్రెస్ నాయకులు వారిని సోదాలు చేశారని తెలిపారు. వీరికి ఈ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ నిర్వహించిన మహిళా సమావేశం విజయవంతం అయినందుకే, అది జీర్ణించుకోలేక కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌడీలు ఇలా ప్రవర్తించారని ఆమె దుయ్యబట్టారు. కనీసం మహిళలు అని చూడకుండా సోదాలు చేస్తుంటే ఇక్కడి పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తనను మార్చుకోకపోతే మహిళాలోకం ఊరుకోదని పేర్కొన్నారు. అనంతరం టిఎల్‌ఎఫ్ నాయకురాలు కుసుమ మాట్లాడుతూ…కాంగ్రెస్‌కు చెందిన కొంతమంది నాయకులు తన ఇంట్లో చొరబడి సోదాలు చేశారని, మహిళ అని చూడకుండా తనపై దాడి చేశారని, డబ్బులు ఎక్కడున్నాయని అడిగారని పేర్కొన్నారు. డబ్బులు దొరక్కపోవడంతో నల్లముఖాలు వేసుకుని వెళ్లిపోయరని తెలిపారు. ఇది కాంగ్రెస్ నాయకులకు తగదని చెప్పారు. రౌడీలు, గూండాలు మహాకూటమి తరుపున పనిచేస్తున్నారని, మహిళలపట్ల కనీస గౌరవం కూడ లేదన్నారు. తదనంతరం కార్పోరేటర్ నస్రీన్‌బేగం మాట్లాడుతూ…గుంటూరుపల్లి, విశ్వంపేట, రామగుండం రూరల్ ప్రాంతాలకు చెందిన మహిళ లతో సమావేశం ఏర్పాటు చేశామని తమపై దాడి జరిగిందని పేర్కొన్నారు. అధికారం రాకముందే మహాకూటమి అభ్యర్తి జులం చెలాయిస్తున్నారని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో బాధిత మహిళలు పరమేశ్వరి, సంద్య, కర్ణ, శీల, రజిత పాల్గొన్నారు.