మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్సియల్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

ఝరాసంగం అక్టోబర్ 12( జనంసాక్షి)మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలో గల మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్సియల్ పాఠశాలలో  న్యాయ విజ్ఞాన సదస్సును మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ సూరి కృష్ణ  నిర్వహించి విద్యార్థులకు మోటారు వాహనాల చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, ట్రాఫిక్ రూల్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో   విద్యార్ధి దశ చాలా కీలకమైనదని, సమయ పాలన పాటించాలని, చెడుకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ వహించాలని, తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని సూచించారు. విద్యార్థులు ఎవ్వరూ వయసు, లైసెన్స్, హెల్మీట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ఒకవేళ పై నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడిపి ప్రమాదానికి కారణమైన కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు కూడా శిక్షార్హులేనని పేర్కొన్నారు. విద్యార్థులందరూ మంచిగా చదువుకొని, ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో  సెక్రటరీ సంతోష్ కుమార్ సాగర్,  న్యాయవాదులు మానెన్న, సయ్యద్ షకీల్, గోపాల్, విశ్వనాధ్, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్, పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు  మరియు విద్యార్థులు  పాల్గొన్నారు.