మహానీయులను స్మరిస్తూ, జాతీయ ఐక్యత స్ఫూర్తిని చాటుకుందాం

-ఎంపీపీ స్నేహ

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 11 :
స్వాతంత్రోద్యమంలో అమరులైన మహానీయులను స్మరిస్తూ, జాతీయ ఐక్యత స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీపీ స్నేహ అన్నారు. గురువారం 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలని పురస్కరించుకుని ఎంపీపీ స్నేహ, అలంపూర్ వలయాధికారి సూర్యనాయక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గ్రంథాలయం నుండి ఫ్రీడం 2కె రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రంథాలయం నుండి గురుకుల పాఠశాల వరకు ఫ్రీడం రన్ లో పాల్గొని దేశభక్తిని చాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో పార్టీలకు, కుల మతాలకు అతీతంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి పౌరుడు తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సుబ్రమణ్యం, మండల విద్యాధికారి రాజు, ఇటిక్యాల ఎస్సై గోకారి, కోదండాపురం ఎస్సై వెంకటస్వామి, స్థానిక ఎంపీటీసీ యుగంధర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రెవిన్యూ సిబ్బంది, గ్రామప్రజలు మరియు యువకులు పాల్గొన్నారు.