మహారాష్ట్రలో భారీ వర్షాలు

– నాగ్‌పూర్‌లో నీటమునిగిన ప్రైవేట్‌ పాఠశాల భవనం
– చిన్నారులను పడవల ద్వారా బయటకు తీసుకొచ్చిన సహాయక సిబ్బంది
– భారీ వర్షాలతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం
ముంబయి, జులై7(జ‌నం సాక్షి) : భారీ వర్షాల కారణంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయి అతలాకుతలమవుతోంది. శనివారం ఉదయం నుంచి కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా నవీ ముంబయి, థానేలోని కొన్ని ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మలద్‌, డొరివలి, పోవై, భందుప్‌, కల్యాణ్‌ ప్రాంతాల్లోని ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల విూద మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. అటు నాగ్‌పూర్‌లో భారీ వర్షం కారణంగా ఓ ప్రైవేటు పాఠశాల భవనం నీటమునిగింది. వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది పాఠశాలలో చిక్కుకున్న చిన్నారులను పడవల ద్వారా బయటకు తీసుకొచ్చారు. వర్షం ప్రభావం వల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బదాల్‌పూర్‌, కల్యాణ్‌ రైల్వే స్టేషన్‌ మార్గం నీట మునగడంతో రైల్వే సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఉల్హాస్‌ నదిలో వరద నీరు ప్రమాద స్థాయికి చేరుకుందని మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో 24గంటల పాటు భారీ వర్షాలు కురిసేఅ వకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే ముంబయిలోని పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టారు.