మహారాష్ట్రలో మరో ట్విస్ట్‌ 

– సీఎం పదవికి ఫడ్నవీస్‌ రాజీనామా
– ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సంఖ్యాబలం లేదని స్పష్టీకరణ
– బలపరీక్షకు ముందే తన ఓటమిని ఒప్పుకున్న బీజేపీ
– చివరి నిమిషంలో చేతులెత్తేసిన అజిత్‌ పవార్‌
ముందే రాజీనామా సమర్పించిన అజిత్‌
– మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్‌ఠాక్రేకు రూట్‌ క్లియర్‌
– నేడు అసెంబ్లీలో బలపరీక్షకు సర్వంసిద్ధం
– ప్రజాతీర్పుకు శివసేన వెన్నుపోటు పొడించింది
– పార్టీలను చీల్చాలనే ఉద్దేశం మాకు లేదు
– ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడతాం
– విలేకరులతో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
ముంబయి, నవంబర్‌26(జనం సాక్షి) : మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్‌ విూద ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రలో ఊహించిన పరిణామాలు జరిగాయి. ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ ,ఉపముఖ్యంత్రి అజిత్‌ పవార్‌/-లు రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే అస్త్ర సన్యాసం చేశారు. అజిత్‌ పవార్‌ను నమ్ముకుని సిఎంగా ప్రమాణం చేసిన ఫడ్నవీస్‌ కూడా చివరకు చేతులెత్తేశారు.  మంగళవారం మధ్యాహ్నం వరకు అధికారం మాదే, ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఉన్నారని బీరాలు పోయైన బీజేపీ .. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కొంత వెనక్కు తగ్గింది. సుప్రీంకోర్టులో అసెంబ్లీలో బలపరీక్షకు 15రోజులు సమయం ఇవ్వాలని బీజేపీ కోరినప్పటికీ అందుకు న్యాయంస్థానం అంగీకరించ లేదు. ఖచ్చితంగా బుధవారమే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దీనికితోడు సోమవారం తమ ఎమ్మెల్యేలతో శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. మరోవైపు ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వెంట ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవటంతో ఆయన సైతం డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని భావించిన అధిష్టానం పెద్దలు ఫడ్నవీస్‌ను కూడా వెనక్కి తగ్గాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. దీంతో ఫడ్నవీస్‌ సీఎం పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్‌కు లేఖను అందించారు. దీంతో శివసేన నేత ఉద్దవ్‌ ఠాక్రే సీఎంగా బాధ్యతలు స్వీకరించటానికి లైన్‌ క్లియర్‌ అయినట్లయింది. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుమేరకు బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం సాయంత్రం 5గంటల వరకు బలపరీక్ష నిర్వహించనున్నారు. బీజేపీ ప్రభుత్వం నుంచి తప్పుకోవటంతో బలపరీక్ష నామమాత్రం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉద్దవ్‌ ఠాక్రేను సీఎంగా నిర్ణయిస్తూ కాంగ్రెస్‌, శివసేన, ఎన్సీపీలు నిర్ణయించాయి. ఇక ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం లాంఛనంగానే కనిసిస్తుంది.
ప్రజాతీర్పుకు శివసేన వెన్నుపోటు
ప్రజాతీర్పుకు శివసేన వెన్నుపోటు పొడించిందని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా తాను రాజీనామా చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా శివసేనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ ఏర్పాటులో మాకు ఎలాంటి దురుద్దేశం లేదని అన్నారు. పార్టీలను చీల్చాలనే ఉద్దేశం అస్సలు లేదని ఫడ్నవీస్‌ స్పష్టం చేశారు. ప్రజాతీర్పుకు అనుకూలంగా ప్రభుత్వ
ఏర్పాటుకు ప్రయత్నించామని, అసెంబ్లీలో బీజేపీనే అతి పెద్ద పార్టీ అని, మెజార్టీ ప్రజలు బీజేపీకే
అనకూలంగా తీర్పునిచ్చారని అన్నారు. ఎన్నికల ప్రచారంలోనూ శివసేన ముఖ్యమంత్రి పదవి కావాలని అడగలేదని, ఫలితాల తరువాత శివసేన తనవైఖరి మార్చుకొని సీఎం స్థానాన్ని పంపకాలు చేయాలని కొత్త ప్రతిపాదన తెరపైకి లేపిందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్‌ మాకే ఆహ్వానం పంపారని, శివసేన మద్దతు కోసం ఎదురుచూశామని, శివసేన సిద్దాంతాలని గాలికి వదిలేసిందన్నారు.
ఫలితాల తర్వాత శివసేన వైఖరి మారిపోయింది,  మాకు సంఖ్యాబలం లేదని శివసేన గవర్నర్‌ కు తెలిపిందన్నారు. ముఖ్యమంత్రి పదవి పంచుతామని శివసేనకు మేం హావిూ ఇవ్లేదని, ప్రభుత్వ ఏర్పాటుకు అజిత్‌ పవారే మమ్మల్ని సంప్రదించారన్నారు. తాము శివసేనకు మద్దతు ఇచ్చే ఉద్దేశం లేదని, బీజేపీకి మద్దతు ఇస్తామని, ఎన్సీపీ ఎమ్మెల్యేలు తన వెంట వస్తారని చెప్పారని అన్నారు. దీంతో తాము అధికారం ఏర్పాటు చేశామని, కానీ సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అజిత్‌ పవార్‌ తన వెంట ఎమ్మెల్యేలెవరూ లేరని చెప్పారని, డిప్యూటీ సీఎంకు రాజీనామా చేశారని అన్నారు. దీంతో తాము కూడా ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కష్టమని భావించి సీఎం పదవికి రాజీనామ ఆచేసినట్లు ఫడ్నవీస్‌ తెలిపారు. అధికారంలో ఉన్న కాలంలో ప్రజా సంక్షేమం కోసం తమ పాలన సాగించామని అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమవంతు కృషి చేస్తామని ఫడ్నవీస్‌ స్పష్టం చేశారు.